
రూ. 4.60 లక్షల ఖర్చుతో పేదలకు ఇళ్లు
పేదలకు ఒక్కొక్కరికి రూ. 4.60 లక్షల ఖర్చుతో ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వం వీటికి రూ. 3.50 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. పెరిగిన అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇంద్రకరణ్ చెప్పారు. తెలంగాణ గృహ నిర్మాణ శాఖపై మంత్రి సోమవారం సమీక్షించారు.
వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఏడాదికి రూ. 2 లక్షల ఇళ్ల చొప్పున మొత్తం 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీఐడీ నివేదిక వచ్చాక అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.