సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు కొత్త కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ మరో కొత్త పథకాన్ని అతిత్వరలో లాంఛనంగా ప్రారంభించనుంది. ‘డ్రైవర్ కమ్ ఓనర్’ (డీసీఓ)అనే పథకం ద్వారా 105 మంది లెసైన్సు కలిగిన డ్రైవర్లకు బ్యాంకు సహకారంతో కొత్త కార్లను అందజేయనుంది. ఈ పథకంలోని లబ్ధిదారులు తమ వాహనాలను జీహెచ్‌ఎంసీ అధికారులకే హయ్యర్‌పై నడపనున్నారు.
తద్వారా వారికి ఉపాధితోపాటు, బ్యాంకు రుణం తీరిపోగానే కార్లు వారి సొంతం కానున్నాయి. ఇప్పటి వరకు ట్యాక్సీలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి.. సొంత వాహనం కొనుక్కోలేక అద్దెకార్లకే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. తద్వారా డ్రైవర్లే కార్ల ఓనర్లు కానున్నారు.
ఇదీ విధానం..
దాదాపు రూ. 7 లక్షల విలువైన కార్లను బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తున్నారు. మొత్తం వ్యయంలో లబ్ధిదారు వాటాగా 25 శాతం చెల్లించాల్సి ఉంది. మిగతా 75 శాతం సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎస్‌బీహెచ్ నుంచి బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. ఎస్సీ/ఎస్టీలకు చెందిన వారైతే కేవలం 10 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. మిగతా 90 శాతం సొమ్మును జీహెచ్‌ఎంసీ బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది.
నెలనెలా వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంది. కాగా బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి పరిశ్రమలశాఖ ద్వారా సబ్సిడీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా 105 మందికి కొత్త కార్లు ఇప్పించే ప్రక్రియ పూర్తయిందని, త్వరలో (పంధ్రాగస్టులోగా) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఇక ‘డ్రైవర్ కమ్ ఓనర్’
Published Sun, Aug 10 2014 1:04 AM | Last Updated on Sat, Sep 29 2018 5:34 PM
Advertisement