కరువు కానరాదా? | Drought areas in telangana | Sakshi
Sakshi News home page

కరువు కానరాదా?

Published Sat, Feb 21 2015 1:48 AM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

కరువు కానరాదా? - Sakshi

కరువు కానరాదా?

రాష్ట్రంలో కరువు పరిస్థితులను పట్టించుకోని సర్కారు
401 మండలాలను ప్రతిపాదించిన కలెక్టర్లు
88 మండలాలకే ఉన్నత స్థాయి కమిటీ గ్రీన్‌సిగ్నల్!
ప్రభుత్వ తీరుపై రైతు సంఘాల మండిపాటు     
 
 తెలంగాణలో దుర్భర పరిస్థితులను పట్టించుకోని సర్కారు
ముఖం చాటేసిన రుతుపవనాలు.. కురిసీ కురవని వర్షాలు.. భారీగా తగ్గిపోయిన సాగు విస్తీర్ణం.. సగానికిపైగా పడిపోయిన దిగుబడులు.. రాష్ట్రంలో ఇంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా, ఇవేవీ ప్రభుత్వానికి మాత్రం కానరావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు మొత్తుకొంటున్నా... అధికార యంత్రాంగం అసలేమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే.. కరువు ప్రాంతాలుగా గుర్తిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది మరి!
 - సాక్షి, హైదరాబాద్
 
 401 మండలాలు గుర్తింపు
 రాష్ట్రవ్యాప్తంగా 401 మండలాల్లో కరువు పరి స్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కరువు పరిస్థితుల నిర్ధారణపై ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ మాత్రం... అందులో 88 మండలాలనే కరువు ప్రభావిత మండలాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుంటే... 40 మండలాల్లో కరువు ఉన్నట్లు అక్కడి కలెక్టర్ ప్రతిపాదించారు. కానీ రాష్ట్రస్థాయి కమిటీ మాత్రం ఆ జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించలేదు. ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా... 32 మండలాల్లో కరువు ఉందని కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చింది. కానీ ఆ జిల్లాలోనూ  ఒక్క కరువు మండలం లేదని నిర్ధారించినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోని 51 మండలాల్లో 40 చోట్ల కరువుందని కలెక్టర్ ప్రతిపాదిస్తే... ఒక్క మండలాన్ని మా త్రమే కరువు ప్రభావితంగా గుర్తిం చారు. ఇలా ప్రతీ జిల్లా నుంచి వచ్చి న ప్రతిపాదనల్లో చాలా వాటిని తొలగించడం గమనార్హం.
 
 తీవ్ర వర్షాభావం..
 రాష్ట్రంలో 2014-15 ఏడాదికి వ్యవసాయ రంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కుంటోంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్‌లో లోటు వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ మినహా ఏజిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. గత జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 30 శాతం లోటు నమోదైంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 464 మండలాలకుగాను.. 339 మండలాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. కేవలం 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షపాతం లోటు కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఈ కారణాలన్నింటితో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.
 
 భారీగా పడిపోయిన దిగుబడి
 రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో పంటల ఉత్పాదకత పడిపోయింది. అనేకచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 78.98 లక్షల టన్నులుగా వ్యవసాయ శాఖ నిర్దేశించుకోగా... దిగుబడి 53.86 లక్షల టన్నులకు మాత్రమే చేరుకుంది. ఏకంగా 25.11 లక్షల టన్నుల (31.81%) ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తంగా వరి దిగుబడి లక్ష్యం 50.81 లక్షల టన్నులుకాగా... 35.27 లక్షల టన్నులకే పరిమితమైంది. 15.54 లక్షల టన్నులు (30.59) తగ్గింది. పప్పుధాన్యాల పరిస్థితీ అంతే. శనగ 0.47 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా.. 0.14 లక్షల టన్నులకే పరిమితమైంది. సోయాబీన్ 4.7 లక్షల టన్నులకుగాను 4.12 లక్షల టన్నులు దిగుబడి అయింది. ఇక పత్తి దిగుబడి భారీగా పడిపోయింది. ఇలా కరువు పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లే వ్యవహరిస్తోంది.
 
 తగ్గిపోయిన సాగు..
 ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. అందులో వరి సాగు 10.04 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 8.17 లక్షల హెక్టార్లకు (81%) పడిపోయింది. పప్పుధాన్యాల సాగు 4.92 లక్షల హెక్టార్ల నుంచి 3.45 లక్షల హెక్టార్లకు (70%) తగ్గింది.
 
 ఇదీ లెక్క!
 ఐదు అంశాల ఆధారంగా కరువు పరిస్థితులను నిర్ధారిస్తారు. ఒకటి వర్షపాతం 50 శాతానికన్నా తక్కువగా నమోదు కావడం.. రెండోది వర్షాల మధ్య అంతరం.. మూడోది మండలం యూనిట్‌గా తగ్గే సాగు విస్తీర్ణాన్ని లెక్కిస్తారు.. నాలుగోది పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవడం.. పశుగ్రాసానికి కొరత ఐదో అంశం.. ఈ ఐదింటిలో ఏ మూడు అంశాలు కరువు ప్రకటన నిబంధనలకు సరిపోయినా... ఆయా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. ఈ సారి వర్షానికి వర్షానికి మధ్య 20రోజులకు మించి అంతరం ఉంది. ఖరీఫ్ సీజన్‌లో జూన్, జూలై నెలల్లో వర్షాలు సరిగా పడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాస్త కురిశాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం, దిగుబడి దారుణంగా పడిపోయాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ధారించిన దానికంటే.. కరువు మండలాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
 రాష్ట్రవ్యాప్తంగా కరువే..
 ‘‘కరువు నిర్ధారణ అంశాల ఆధారంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కరువు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు 40 లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. దీంతో సాగు విస్తీర్ణం 50 శాతంలోపే ఉన్నట్లు లెక్క. వరి ఎండిపోవడంతో చాలా చోట్ల రైతులు తగులబెట్టేశారు. వేసిన పత్తిలో 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన ఫలితాలు కూడా 50 శాతంలోపే దిగుబడి వచ్చిందని నిర్ధారణ అయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కలెక్టర్లు వాస్తవ ప్రతిపాదనలు తయారుచేశారు. కానీ ప్రభుత్వం మాత్రం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టేందుకు కరువు మండలాలను తక్కువ చేసి చూపిస్తోంది. కరువు మండలాల ప్రకటన చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదు..’’
 - సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం జాతీయ నాయకుడు
 
 ఖరీఫ్ తంటాలు.. (2014 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు)
 సాధారణ వర్షపాతం : 715 మిల్లీమీటర్లు
 కురిసింది.. 498.1 మి.మీ
 మొత్తం మండలాలు : 464
 వర్షాభావం నెలకొన్నవి : 339
 సాధారణ వర్షపాతం నమోదైనవి.. 80
 ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం.. 78.98 లక్షల టన్నులు
 ఇప్పటివరకు వచ్చిన దిగుబడి.. 53.86లక్షల టన్నులు
 తగ్గిన దిగుబడి : 31.81%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement