
తాగుబోతు అల్లుడి దురాగతం
తాగిన మైకంలో ఓ ప్రబుద్ధుడు అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా బావమరుదుల వాహనాలు దహనం చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక వెంకంపేటకు చెందిన పంతగాని లక్ష్మీరాజం కూతురు లావణ్య వివాహం సాయినగర్‌కు చెందిన గంగుల ప్రకాశ్‌తో పదేళ్ల క్రితం జరిగింది. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం తేవాలని ప్రకాశ్ భార్య లావణ్యను వేధించాడు. దీంతో లక్ష్మీరాజం అల్లుడికి గణేశ్‌నగర్‌లో ప్లాటు కొనిచ్చాడు. వ్యసనాలకు బానిసైన ప్రకాశ్ దానిని అమ్ముకున్నాడు.
పలుమార్లు లావణ్యను వేధించడంతో పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చాడు. ఇటీవల ప్రకాశ్ అత్తారింటికి వచ్చి అందరిపై దాడిచేసి డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో వారు సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో గురువారం రాత్రి 11 గంటలకు అత్తారింటి గేటుదూకి బావమరుదుల వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనలో రూ.లక్ష ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.