టీఆర్‌ఎస్‌లోకి డీఎస్! | ds enter in to trs party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి డీఎస్!

Published Thu, Jul 2 2015 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌లోకి డీఎస్! - Sakshi

టీఆర్‌ఎస్‌లోకి డీఎస్!

 ⇒ గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయం
  ⇒ బుధవారం ముఖ్యమంత్రి
  ⇒ కేసీఆర్‌తో డీఎస్ భేటీ
  ⇒ ఆయనను స్వయంగా  తీసుకెళ్లిన ఎంపీ కవిత
   ⇒ నేడో రేపో అధికారికంగా  ప్రకటించే అవకాశం
   ⇒ ఇదే దారిలో దానం సహా మరికొందరు నేతలు


 సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోభేటీ అయ్యారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత స్వయంగా డీఎస్‌ను క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. డీఎస్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని దీనితో తేలిపోయింది. అయితే అటు డీఎస్ కానీ, ఇటు టీఆర్‌ఎస్ నాయకత్వం కానీ ఆయన చేరికపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లుగా బుధవారం రాత్రే ఏఐసీసీ నాయకత్వానికి డీఎస్ ఒక లేఖను    ఫ్యాక్స్ చేశారు. గురువారం ఉదయం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 కీలక పదవి ఇచ్చే అవకాశం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్‌కు టీఆర్‌ఎస్‌లో సముచిత స్థానమే దక్కనుంది. ఎమ్మెల్సీగా లేదా రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నా... డీఎస్ స్థాయికి తగిన  పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆయనకు కట్టబెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి గెలిపించి ముఖ్యమైన శాఖలతో మంత్రి పదవి ఇవ్వనున్నారన్న ప్రచారమూ జరుగుతోంది.

 రుణం తీర్చుకుందాం!
 వాస్తవానికి నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యంలో ఉంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి డీఎస్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ జిల్లాకు చెందిన నేతలు సీఎం కేసీఆర్ ఎదుట వాదించారని సమాచారం. అయితే తెలంగాణ సాధనలో డీఎస్ కషిని విస్మరించలేమని, అన్నీ రాజకీయాల కోసమే చేయమని, కొన్ని విలువల కోసం చేస్తామని చెప్పి సీఎం వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. తెలంగాణవాదిగా ముద్రపడి కాంగ్రెస్‌లో ఇబ్బందిపడిన డీఎస్‌ను దగ్గరకు తీసుకుంటే బాగుంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమకాలం నుంచి డీఎస్‌కు, కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలే ఉండడంతో అదిప్పుడు వారు కలసి పనిచేయడానికి ఊతమిచ్చిందని పేర్కొంటున్నారు.

 ఇదే దారిలో..
 టీఆర్‌ఎస్‌లో చేరడానికి మరికొందరు నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కే చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గులాబీ పార్టీలో చే రనున్నారని.. గత ఆరునెలలుగా ఆయన ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ  ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ల పేర్లు కూడా వినవస్తున్నాయి. అయితే వీరెవరూ డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌లో చేరే జాబితాలో లేరని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో మెజారిటీ కార్పొరేటర్లు, ఓ జెడ్పీటీసీ సభ్యురాలు డీఎస్ వెంట గులాబీ  తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
 
 నన్ను అవమానించారు... సోనియాగాంధీకి డీఎస్ లేఖ
 
తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో నావంటి నిజాయితీ కలిగిన నాయకులను అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, నిజాయితీ కలిగిన వారిని, అనుభవమున్న నాయకులను అంతర్గతంగా ఇబ్బందులు పెడుతున్నారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు.

తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో  నష్టపోయామన్నారు. పార్టీలో విద్యార్థి దశ నుంచి అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తున్న తనను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘జానారెడ్డి, జీవన్‌రెడ్డి వంటి నేతలు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్‌రెడ్డి జనతాదళ్‌లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి నేతలను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు.

పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాతా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్‌సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్‌గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు.

 నేడు రాజీనామా ప్రకటన..
 డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement