డీఎస్సీకి జాప్యం తప్పదు
హేతుబద్ధీకరణ తర్వాతే ఖాళీలపై స్పష్టత: కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ఆలస్యం తప్పదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తయ్యాక ఉపాధ్యాయ ఖాళీలపై లెక్కలు తేలుతాయన్నారు. ఆ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. 1998 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీలలో మిగిలిపోయిన వారికి ఏ మాత్రం అవకాశమున్నా పోస్టింగులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పేర్నొన్నారు. దీనిపై ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం అడిగామన్నారు. అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఉపాధ్యాయ బదిలీలపై పత్రికల్లో వివిధ కథనాలు వస్తున్నాయని, ప్రభుత్వపరంగా ఎలాంటి అక్రమ బదిలీలు చేయలేదని కడియం వివరించారు. విచక్షణాధికారంతో 19 బదిలీలు మాత్రమే చేశామన్నారు. అందులో 16 బదిలీలు జిల్లాల పరిధిలోనే చేశామని చెప్పారు. ఒక బదిలీ మాత్రం హైదరాబాద్ కు, మరొక బదిలీని కరీంనగర్ నుంచి ఖమ్మంకు, ఒక ప్రధానోపాధ్యాయుడిని ఒకే జోన్‌లో వేరే జిల్లాకు బదిలీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి బదిలీలు చేయలేదని, జిల్లాలో ఇప్పటికే నాన్ లోకల్ కేటగిరీలో కోటాకు మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి బదిలీగానీ, డిప్యుటేషన్‌గానీ ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ఒత్తిళ్లున్నా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర ్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాతే ఖాళీ పోస్టులను భర్తీ చే స్తామన్నారు. జీవో 1 ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకే రకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిందేనని, ప్రైవేటు స్కూళ్ల ఇష్ట ప్రకారం ప్రభుత్వం నడవదని కడియం వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని, అమలు చేయకపోతే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణ విషయంలో కోర్టులో కేసు తేలగానే చర్యలు చేపడతామన్నారు.
హేతుబద్ధీకరణ తరువాతే ఆలోచన: కడియం
ప్రాథమిక పాఠశాలల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్న వాటికి అదనపు టీచర్‌ను ఇచ్చే విషయంలో హేతుబద్ధీకరణ, బదిలీల తరువాతే ఆలోచిస్తామని కడియం చెప్పారు. పాఠశాలకు ఒకే టీచర్‌ను ఇచ్చేలా హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఉండడం వల్ల ఆ స్కూళ్లలో ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని కడియం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై తరువాత ఆలోచిస్తామని తెలిపారు. రేషనలైజేషన్ పూర్తయ్యాక 30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లకు టీచర్‌ను ఇవ్వాలా? అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌ను ఇవ్వాలా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.