
సాక్షి, లింగంపేట(నిజామాబాద్) : మండలంలోని జల్దిపల్లి లో వివాదాలకు పోతే చర్యలు తప్పవని అందరూ సోదరభావంతో మెలగాలని ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తెన్న సూచించారు. శుక్రవారం పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు గ్రామంలో వివాదాస్పదం కావడంతో వారు విచారణకు వచ్చారు. అన్ని వర్గాల వారిని సంయమనం పాటించాల ని సూచించారు. ఈ క్రమంలో గ్రామంలో శాం తియుత వాతావరణం నెలకొల్పడానికి అధికారులు కృషి చేశారు.
గతంలో ఎస్సీలకు గ్రామంలో తీగునీరు, విద్యుత్, హోటళ్లు, కిరాణ దుకాణాల్లో సరుకులు నిషేధించినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. శుక్రవారం అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కబడ్డాయా లేదా అన్న విషయంపై ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడా రు. తాము అందరం కలిసిమెలసి ఉంటున్నామని ఎలాంటి బహిష్కరణలు చేసుకోవడంలేదని వివరించారు. గ్రామంలో అన్ని వర్గాల వారిని విచారించారు.
అనంతరం వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలసి జీవించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్నేహంగా మెలగాలన్నారు. సమాజంలో అందరూ సమానమే అన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా కాదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.