పైసలిస్తేనే ఫైళ్లు కదిలేది
ప్రతి పనికో రేటు.. చేసిన పనికి బిల్లు రావాలన్నా ఓ రేటు.. చేయి తడిపితే తప్ప ఫైల్ ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు కదలదు. ప్రభుత్వశాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో వేళ్లూనుకున్న అవినీతి జాఢ్యపు జాడలివి. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ.. ఇలా శాఖ ఏదైనా అవినీతి వేళ్లూనుకుపోయింది.
కరీంనగర్ సిటీ : ప్రభుత్వం నుంచి జిల్లావ్యాప్తంగా చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రూపొందించే ఇంజినీరింగ్ విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు లాగుతుండడం, వచ్చిన మామూళ్లను అంతా పంచుకోవడం ఇక్కడ రివాజుగా మారింది. బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు తీసుకుంటూ సాక్షాత్తు కరీంనగర్ డివిజన్ ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సుధాకర్‌రెడ్డి బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కడం అక్రమాల తంతుకు తాజా తార్కాణం.
పెగడపల్లి మండలం నంచర్లలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ బిల్లు ఇవ్వడానికి లంచం డిమాం డ్ చేయడంతో బాధితుడు రవీందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి పట్టించాడు. ఏసీబీ దాడులతో ఈ ఒక్క ఘటన వెలుగు చూసినా.. ఇక్కడ నిత్యం జరిగేది ఇదే తంతు. ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో చేపట్టే వాటర్‌ట్యాంక్‌లు, పైప్‌లైన్లు ఇతర నిర్మాణాలకు బిల్లులు చెల్లించాలంటే ప్రతి కాంట్రాక్టర్ కొంత ముట్టచెప్పాల్సిందే. అవినీతి ఎంతగా ముదిరిపోయిందంటే... ఈ శాఖల్లో పనులకు సంబంధించి బిల్లులు పొందాలంటే, అంచనా వ్యయంలో కచ్చితంగా పది శాతం సమర్పించుకోవాల్సిందే. ఇది ఇంజినీరింగ్ విభాగాల్లో అందరికీ తెలిసిన రహస్యం.
నాణ్యత గాలికి...
పైప్‌లైన్, వాటర్‌ట్యాంక్, రోడ్లు, భవనాలు... నిర్మాణం ఏవైనా అధికారులు నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఏ పని పూర్తయినా అందులో పది శాతం తమకు వచ్చిందా..? లేదా? అని చూడడానికే అధికారులు మొగ్గుచూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా మామూళ్లు తీసుకోవడంలో చూపించే శ్రద్ధ, పనుల నాణ్యతలో చూడడం లేదని, కొంతమంది కాంట్రాక్టర్లు కూడా అధికారుల ప్రోత్సాహంతో నాణ్యతను గాలికొదిలేసి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెద్దల అండ
ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న అక్రమార్కులకు పెద్దల అండ లభిస్తుండడంతో సంవత్సరాలుగా మామూళ్ల తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది. కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధిస్తున్న ఉద్యోగులను శిక్షించాల్సిన ఉన్నతాధికారులు కూడా అలాంటి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులే అవినీతిని ప్రోత్సహిస్తున్నారనడానికి బుధవారం జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం. ఇంజినీరింగ్ విభాగాల్లో నెలకొన్న అవినీతి, అక్రమాలకు అడుకట్ట వేస్తే తప్ప పనుల్లో నాణ్యత కనిపించదు.