'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి'
వరంగల్ : మానవత్వంతో వ్యవహరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య శనివారం వరంగల్లో హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన జూడాలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ సర్వీసు మినహా జూడాల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తున్నామంటూ జూడాలు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.