సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మీ గ్రామానికి ఎంత ఆదాయం వస్తోంది? కేంద్రప్రభుత్వం ఎన్ని నిధులిస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు పంపుతోంది? వీటిలో ఎన్ని రూపాయలు ఖర్చయ్యాయి? వేసిన రోడ్లెన్ని? కల్పించిన మౌలిక సౌకర్యాలేంటి? ఊర్లో ఎంతమంది పుట్టారు? ఎంతమంది చనిపోయారు? తదితర వివరాలన్నీ ఇక నుంచి కంప్యూటర్లలో నిక్షిప్తం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ-పంచాయతీ కార్యక్రమానికి జిల్లాలోని 17 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలను తొలిదశలో ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మలిదశలో, తదుపరి దశల్లో జిల్లాలో కంప్యూటర్లున్న 365 పంచాయతీలను ఈ -పంచాయతీలుగా చేయాలని యోచిస్తున్నారు.
ఏదైనా కంప్యూటర్ ద్వారానే..
ఈ-పంచాయతీ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్నంతటినీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఒక గ్రామంలో పన్ను వసూలు ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? ఆ గ్రామానికి వివిధ పన్నుల ద్వారా స్థానికంగా వస్తున్న ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు అవుతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారు? అందులో ఎంత ఖర్చు అవుతోంది? ఈ ఖర్చు ద్వారా గ్రామానికి కలుగుతున్న ప్రయోజనమేంటి? మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గ్రామంలో వేసిన రోడ్లెన్ని? కట్టిన డ్రైనేజిలెన్ని? ఎన్ని నల్లాలు, బోర్లు, చేతిపంపులు ఏర్పాటు చేశారు?లాంటి వివరాలన్నీ ఆన్‌లైన్ చేస్తారు.
వీటితో పాటు గ్రామంలో జనన, మరణాలను కూడా ఆన్‌లైన్‌లోనే రికార్డు చేయనున్నారు. గ్రామంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా.. వివరాలన్నీ కంప్యూటర్‌లోకి ఎక్కించనున్నారు. జనన, మరణాల నమోదుకు సంబంధించిన బాధ్యతను పంచాయతీ కార్యదర్శికి అప్పగించి, జనన, మరణాలు సంభవించిన వారం రోజుల్లో కంప్యూటర్‌లో నమోదు చేయిస్తామని అధికారులు చెపుతున్నారు.
జిల్లాలో ఈ-పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీలివే..
జిల్లాలో ఈ పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీల్లో నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, వైరా, అశ్వారావుపేట, పెదతండా, సారపాక, బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, బయ్యారం, గార్ల, భద్రాచలం, కూనవరం, చర్ల, మోతుగూడెం (మోతుగూడెం ముంపు గ్రామం కింద ఆంధ్రలో కలవనుంది) ఉన్నాయి.
ఈ- కనుసన్నల్లో... ‘నెట్టింట్లో’ గ్రామం
Published Sun, Jul 27 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement