ఎంసెట్-3లో 13 తప్పులు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ప్రశ్నపత్రంలో మొత్తంగా 13 తప్పులు దొర్లాయి. ఏడు ప్రశ్నలకు జవాబులే లేకుండగా.. సిలబస్‌లో లేని ఒక ప్రశ్న వచ్చింది. ఈ ఎనిమిదింటినీ తొలగించిన ఎంసెట్ కమిటీ.. వాటికి సంబంధించి విద్యార్థులందరికీ 8 మార్కుల చొప్పున కలిపింది. ఇక మరో ఐదు ప్రశ్నలకు సంబంధించి ఒకటికి మించి సరైన ఆప్షన్లు రాగా.. వాటిలో దేనిని ఎంచుకున్నా మార్కులు వేసింది. మొత్తంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గురువారం ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల విడుదల అనంతరం ఎంసెట్-3 చైర్మన్, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. 8 ప్రశ్నలను తొలగించి, విద్యార్థులందరికి మార్కులు కలిపినట్లు వెల్లడించారు.
జవాబుల్లేని 8 ప్రశ్నలు తొలగించి 152 మార్కులనే పరిగణనలోకి తీసుకున్నా.. వాటికి సంబంధించి అందరు విద్యార్థులకు 8 మార్కులు కలిపినా తేడా ఏమీ ఉండదని.. ప్రతిభావంతులెవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఇక మరో నాలుగు ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైనవి ఉండగా, మరొక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో మూడు సరైన సమాధానాలు ఉన్నాయని... వాటిల్లో సరైన సమాధానాలు వేటిని ఎంచుకున్నా మార్కులిచ్చామని వివరించారు. తక్కువ సమయంలో పరీక్షను పక్కాగా నిర్వహించి, ఫలితాలను వెల్లడించినట్లు తెలిపారు. అయితే జవాబుల్లేని, సిలబస్‌లో లేని ప్రశ్నలకు విద్యార్థులందరికీ మార్కులు ఇవ్వడం వల్ల... ప్రతిభ లేనివారు ఏం రాయకపోయినా 8 మార్కులు కలిశాయని, ప్రతిభావంతులకు పరోక్షంగా నష్టం జరిగినట్లేనని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
క్షుణ్నంగా పరిశీలన: ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 పరీక్ష ప్రాథమిక కీని అదే రోజు రాత్రి వెబ్‌ైసైట్‌లో అందుబాటులో ఉంచి... 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 20 ప్రశ్నలపై 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటిని ఐఐటీ, ఐఐఎస్‌సీ, హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించి, సిఫార్సులు చేసింది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఫైనల్ కీని ఖరారు చేసి.. మార్కులు కేటాయించింది. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య తెలిపారు.
తొలగించిన ప్రశ్నలు (సెట్ ‘ఎ’ పేపర్ ప్రకారం)
ఏడు ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబు లేనందున వాటిని తొలగించగా, మరో ప్రశ్న సిలబస్‌లో లేకపోవడంతో దానిని తొలగించి.. వాటికి విద్యార్థులందరికి మార్కులు కేటాయించారు. తొలగించిన ప్రశ్నల నంబర్లు 36, 44, 90, 107, 114, 116, 133, 152.
* 11వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3, 4 ఆప్షన్లు మూడూ సరైనవే. వాటిలో ఏది ఎంచుకున్నా మార్కులు ఇచ్చారు.
* 26వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3 ఆప్షన్లు.. 38వ ప్రశ్నకు 1, 3 ఆప్షన్లు, 105వ ప్రశ్నకు 3, 4 ఆప్షన్లు, 121వ ప్రశ్నకు 1, 4 ఆప్షన్లు సరైనవే వచ్చాయి. ఈ ప్రశ్నల్లో సరైన ఆప్షన్ దేనిని ఎంచుకున్నా మార్కులు ఇచ్చారు.