స్వైన్‌ఫ్లూ పంజా | 'East' Another three on confirmation case as swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ పంజా

Published Fri, Feb 20 2015 5:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

స్వైన్‌ఫ్లూ పంజా

స్వైన్‌ఫ్లూ పంజా

‘తూర్పు’న మరో ముగ్గురికి నిర్ధారణ
నెల వ్యవధిలో ఎనిమిది పాజిటివ్ కేసులు
ఆందోళనలో జిల్లా ప్రజలు
రంగంలోకి రాష్ట్ర ఉన్నతాధికారులు
నివేదిక కోరిన వైద్యారోగ్యశాఖ డెరైక్టర్
అటకెక్కిన అవగాహన కార్యక్రమాలు
సాక్షి, మంచిర్యాల : జిల్లాపై ‘స్వైన్‌ఫ్లూ’ పంజా విసిరింది. గడిచిన నెల వ్యవధిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గురువారం మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన బెల్లంపల్లి పట్టణానికి చెందిన మాదాకా సుజాత-సమ్మయ్య దంపతులు, మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన దుర్గమ్మ రాములు నుంచి ఈనెల 17న వైద్యులు నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షలో వీరికి స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారందరూ ‘తూర్పు’ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఈ ప్రాంత ప్రజలతోపాటు జిల్లా యంత్రాంగమూ కలవరపడుతోంది.

జిల్లాలో వ్యాధి తీవ్రత తెలుసుకున్న కుటుంబ ఆరోగ్య శాఖ డెరైక్టర్ గురువారం జిల్లా విద్యాశాఖాధికారి రుక్మిణమ్మకు సాయంత్రం ఫోన్ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు.. రోగుల నివాస ప్రాంతాల పరిస్థితి.. చేపట్టిన ముందస్తు చర్యలపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు డీఎంహెచ్‌వో వివరించారు. దీంతో అధికారులు హుటాహుటిన నివేదిక తయారు చేసి పంపినట్లు తెలిసింది. గత నెల 22న.. పశ్చిమ ప్రాంతంలోని బాసరకు చెందిన ఓ యువతి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చనిపోయింది. వైద్యాశాఖ మాత్రం ఆ యువతి కామెర్ల వ్యాధితో చనిపోయిందని వివరణ ఇవ్వడం గమనార్హం.
 
‘తూర్పు’పై నిర్లక్ష్యమెందుకూ...?
‘తూర్పు’ పరిధిలో ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పారిశుధ్యం.. ప్రజావగాహన కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి ఈ ప్రాంతాలు దూరంగా ఉండడం.. అధికారులెవరూ ఇటు వైపు రాకపోవంతో ఈ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పదిహేను రోజుల క్రితం జిల్లా యంత్రాంగం స్వైన్‌ఫ్లూపై చేపట్టిన అవగాహన కార్యక్రమాల అమలు అటకెక్కింది. ఫలితంగా.. ఆయా ప్రాంతాల్లో ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది.

ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన ఎనిమిది కేసుల్లో.. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో ఇద్దరి చొప్పున నలుగురు, మందమర్రిలో ముగ్గురు, కాసిపేటకు సంబంధించినవే. వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం పొంచి ఉండడంతో వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ముందస్తు చర్యలతో ఒనగూరిందేమీ లేదు. గత నెలలో.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్ధాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పినా ప్రస్తుతం అవి కానరావడం లేదు. పదిహేను రోజుల క్రితం క్షేత్రస్థాయిలో కమిటీల పనితీరు నివేదికలు అధికారులు తెప్పించుకున్నారు.

ఇప్పడు ఆ నివేదికల జాడ లేకుండాపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దండోరా.. పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ శాఖ కార్యదర్శులు.. ఆ శాఖ సిబ్బందికి జారీ చేసిన ఆదేశాలతో అవగాహన కార్యక్రమాలు మూడ్రోజులతోనే ముగిశాయి. క్షేత్రస్థాయిలో.. రోగులకు ప్రాథమిక చికిత్స అందించే గ్రామీణ వైద్యులు (ఆర్‌ఎంపీలు) ప్రజలకు స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల, భైంసా, నిర్మల్ , బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఖానాపూర్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డులు అంతంత మాత్రంగానే తెరుచుకుంటున్నాయి. ఏదేమైనా.. తూర్పు ప్రాంతంలో ఇంకా ‘స్వైన్‌ఫ్లూ’ నీడలు అలుముకునే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు

- బెల్లంపల్లిలో రెండు, మందమర్రిలో ఒకటి..
- భార్యాభర్తలిద్దరికీ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ

మంచిర్యాల టౌన్ : ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి నిర్ధారణ అరుునట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా తాజాగా మరో ముగ్గురు వ్యాధి బారిన పడ్డారు. బుధవారం రాత్రి వచ్చిన నివేదిక ప్రకారం వివరాలిలా ఉన్నారుు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి కాంప్లెక్స్ ఏరియాలో నివాసం ఉంటున్న దంపతులు మడక సమ్మయ్య(44), మడక సుజాత (40) స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. వీరితోపాటు మందమర్రి గుడిపెల్లి గ్రామానికి చెందిన దుర్గం రాములు (40) కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో రాగా వీరంతా ఈ నెల 17వ తేదీన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వీరి నమూనా రక్తం, తెమడ సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి అదే రోజు పంపించారు. దీనికి సంబంధించి రిపోర్టు బుధవారం రాత్రి రాగా ముగ్గురికీ స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే రోజు మరో ఇద్దరి రక్త నమూనాలు పంపించగా కుశని మణమ్మ, సుల్లూరి కీర్తనలకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ ముగ్గురిలో దుర్గం రాములు హైదరాబాద్‌కు వెళ్లగా బెల్లంపల్లికి చెందిన భార్యాభర్తలు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరికి మెరుగైన వైద్య సేవలందిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామని వైద్యుడు నీలకంఠేశ్వర్‌రావు తెలిపారు.
 
స్వైన్‌ఫ్లూ వార్డుపై నిర్లక్ష్యం...
స్వైన్‌ఫ్లూ వార్డు కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. అయితే.. వ్యాధి సోకిన వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వైద్య అందించాల్సి ఉండగా ఎవరూ లేకపోవడంతో వ్యాధి సోకిన వారు ఇష్టారాజ్యంగా ఆస్పత్రిలో తిరుగుతున్నారు. అలాగే ఈ వార్డు కూడా ప్రసూతి విభాగం, రక్తనిధి కేంద్రానికి మధ్యలో ఉండటంతో ఇటుగా వచ్చి పోయేవారు కూడా ఆ వ్యాధి బారిన పడే ప్రమాదామూ లేకపోలేదు. ఆస్పత్రి వర్గాలు ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement