సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకూ బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. 15 రోజులుగా సగటున 30 పాజి టివ్ కేసులు నిర్ధారణ అవుతుండగా, సగటున ఇద్దరు చనిపోతున్నారు. తాజాగా బుధవారం మరో నలుగురు మృతి చెందారు. మృతుల్లో జింబాబ్వేకి చెందిన ప్రిసిల్లా(40), నాచారానికి చెందిన నిఖిల్ సాయి (8 నెలలు), పర్వత్‌నగర్‌కు చెందిన మేస్త్రీ తిరుపతిరెడ్డి (33), కాటేదాన్‌లోని శ్రీరాంనగర్‌కు చెందిన పార్వతమ్మ ఉన్నారు.
పారిశ్రామిక రంగానికి సంబంధించిన సంస్థలో శిక్షణ పొందేం దుకు ఇటీవల నగరానికి వచ్చిన ప్రిసిల్లా స్వైన్‌ఫ్లూతో ఈ నెల 2న గాంధీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం పరిస్థితి విషమించి మృతిచెందారు. నాలుగు రోజులక్రితం ఇదే ఆసుపత్రిలో చేరిన నిఖిల్‌సాయి మధ్యాహ్నం చనిపోయాడు. ఒంగోలు నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పర్వత్‌నగర్‌లో నివాసం ఉంటున్న తిరుపతిరెడ్డి వారంరోజులుగా కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం చనిపోయారు. పార్వతమ్మ నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు.
మంగళవారం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా 25 మంది పాజిటివ్, 42 మంది అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉస్మానియాలో పది మంది, ఫీవర్ ఆసుపత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక కేర్, యశోద, కిమ్స్, కామినేని, రెయిన్‌బో, ఆదిత్య తదితర ఆస్పత్రుల్లో మరో 50 మందికిపైగా అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ మరణాలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తుండగా.. అధికారులు మాత్రం స్వైన్‌ఫ్లూ తగ్గుముఖం పడుతోందంటూ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 2,140 మంది రక్త నమూనాలు పరీక్షించగా, వీటిలో 700కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
స్వైన్‌ఫ్లూతో నలుగురి మృతి
Published Thu, Feb 5 2015 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement