జిల్లా కేంద్రంలోని పాఠశాలలో విద్యార్థులు (ఫైల్)
గద్వాల: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం కొనసాగేనా.. లేక ముగిసినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 31వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలు బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 తర్వాత పరిస్థితిపై ఈలోపు ప్రకటన వస్తుందని విద్యావర్గాలు ఎదురుచూశాయి. ఈ క్రమంలో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మూడు వారాలపాటు ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విధితమే. 14వ తేదీ అంటే వేసవి సెలవులు సమీపిస్తాయి. వాస్తవానికి రెగ్యులర్‌గా తరగతులు కొనసాగితే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి. ఎండల తీవ్రతను బట్టి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ముందుకు తీసుకొస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసినా.. వారం రోజుల వ్యవధిలో తరగతుల నిర్వహణ ఎంతవరకు సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం కొనసాగడం దాదాపు అసాధ్యమని ఉపాధ్యాయలు చెబుతున్నారు. అదీగాక ఏప్రిల్ 15 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.. లేదా అన్నది చూడాలి. ప్రస్తుత కరోనా వైరస్ త్రీవతను చూస్తుంటే లాక్‌డౌన్ పోడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరీక్షలు లేకుండానే పైతరగతులకు..
ఈ ఏడాది ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే ఎగువ తరగతులకు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తయింది. ఈ నెలలో పరీక్షలు నిర్వహించాల్సింది. పరిస్థితులు అనుకూలించకపోతే పరీక్షలు జరిగే అవకాశం లేదు. అదీగాక ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్ ఎత్తి వేస్తే వేసవి సెలవులకు వారం రోజులే ఉంటుంది. ఈ వ్యవధిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడం అసాధ్యమే. ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పరీక్షల నిర్వహణ ఉండదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
టెన్త్ పరీక్షలు ఎప్పుడో..?
ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా సాగాయి. పదో తరగతికి సంబంధించి తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయిన మిగిలిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఎప్పడు నిర్వహిస్తారో కూడా ప్రకటించలేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాతనే పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తుంది. ఏప్రిల్ 14 తరువాత కరోనా వైరస్ అదుపులోకి వస్తే.. ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో పరీక్షలను పూర్తి చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయినా మూల్యాంఖనం వాయిదా పడింది. దీంతో ఇంటర్ ఫలితాల ప్రకటన కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పది విద్యార్థులు పరీక్షల కోసం, ఇంటర్ విద్యార్థుల ఫలితాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ‘నో వర్క్.. నో పే’
సెలవుల్ని పొడిగించడం వల్ల ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ విద్యా సంస్థలలో 30 శాతం ఫీజలు వసూలు కావాల్సి ఉంది. మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో వసూలయ్యే సమయంలో సెలవులు రావడంతో వారి ఆదాయానికి భారీగా గండి పడింది. వారు కూడా పొదుపు చర్యలు చేపట్టారు. నో వర్క్.. నో పే పద్దతిని పాటించేందుకు సన్నద్ధం అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరీక్షలు కూడా నిర్వహించకుండానే విద్యా సంవత్సరం ముగించే పరిస్థితులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment