సాక్షిప్రతినిధి, నల్లగొండ : ప్రచార పర్వానికి మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. డిసెంబర్ ఏడో తేదీన జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలో బూత్‌స్థాయి అధికారులు పోల్ చిట్టీల పంపిణీలో మునిగిపోయారు. మరోవైపు ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాంటి విరామం ఇవ్వకుండా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. చేతిలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, సదరు అభ్యర్థి పార్టీ కార్యకర్తలు గ్రామాలను, పట్టణాల్లో వార్డులను విభజించుకుని ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మూడు నెలలుగా ప్రజల్లోనే ఉండగా, అభ్యర్థిత్వాలు ఖరారు కాకముందే కాంగ్రెస్ సిట్టింగ్‌లు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీనుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు మాత్రం నియోజకవర్గం మొత్తాన్ని చుట్టివచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజవకర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎల్‌ఎఫ్, బీఎస్పీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు, నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు సైతం ఈ నియోజకవర్గాల పరిధిలోనే ప్రచారానికి రావడంతో పూపు కనిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సారి ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థి చావో రేవో తేల్చుకునేలా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరో వైపు ఆయా పార్టీల నుంచి ముఖ్య నాయకత్వం కూడా జిల్లా పర్యటనకు రావడంతో ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది.
సవాల్‌గా తీసుకున్న టీఆర్‌ఎస్
గత ఎన్నికల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఈసారి అంతకు మించి ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలుచుకునేందుకు జిల్లా ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. ఈ కారణంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గ సభల్లో పాల్గొని ప్రసంగించారు. నాలుగో విడతగా ఆయన డిసెంబర్ 3వ తేదీన కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడెం, నల్లగొండల్లో ఏర్పాటు చేసే సభల్లో కూడా పాల్గొననున్నారు. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఇక్కడినుంచే ఎక్కువ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రమిస్తోంది.
టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ ఆర్.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు జిల్లా ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలను గెలుచుకోగా, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ రెండు స్థానాలూ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి. ఇపుడు ఈ ఏడు స్థానాలను తమ సిట్టింగ్‌లుగా భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వం వీటిని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తోంది. దీనిలో భాగంగానే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్నారు.
కేంద్ర మంత్రుల హడావిడి
బీజేపీ ఈసారి భువనగిరి మినహా అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు పర్యటించి వెళుతున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభల్లో పాల్గొంటే, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాగార్జున సాగర్‌లో, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూర్యాటలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పురందరేశ్వరి కూడా నాగార్జునసాగర్ అభ్యర్ధి కంకణాల నివేదిత తరఫున ప్రచారం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థుల సొంత ప్రచారం
ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు సొంతంగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఏఐసీసీ ప్రచార కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ అజారుద్దీర్ మాత్రం నల్లగొండ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి అభ్యర్ధి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేసి వెళ్లారు. ఇక, ఏ అభ్యర్ధికీ బయటినుంచి స్టార్ క్యాంపెయినర్లు రాలేదు. దీంతో ఎవరికి వారే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థుల తరఫున వారి వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారం చేస్తూ ఆకటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment