త్వరలో పరిషత్‌ షెడ్యూల్‌  | Election Commission Releases ZP Elections Notification Soon | Sakshi
Sakshi News home page

త్వరలో పరిషత్‌ షెడ్యూల్‌ 

Published Sun, Apr 14 2019 3:07 AM | Last Updated on Sun, Apr 14 2019 10:17 AM

Election Commission Releases ZP Elections Notification Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్ని కల పోరు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ అం శాలపై చర్చించేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పరిషత్‌ ఎన్నికలకు వివిధ ప్రభుత్వ శాఖల సన్నద్ధత, పంచాయతీరాజ్, ఇతర శాఖల పరంగా చేసిన ఏర్పాట్లు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

ఈ నెల 18న మ్యారియెట్‌ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పీఆర్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిర్వహించే సమావేశంలో శాంతిభద్రతల సమస్యలు, ఎన్నికల ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించనున్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. విస్తీర్ణంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువగా ఉన్న నల్లగొండ, నిజామాబాద్, సంగా రెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లోనే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు ముగించనున్నారు.  

ముసాయిదా షెడ్యూల్‌ సిద్ధం... 
జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ముసాయిదా షెడ్యూల్‌ను రూపొందించుకున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం రెండు విడతల్లో ఈ ఎన్నికలను ముగిస్తే బావుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం చూస్తే.. 22న తొలి నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఆ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలించి అదేరోజు సాయంత్రం 5గంటల తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 26న అప్పీళ్లు స్వీకరించి, 27న వాటిని పరిష్కరిస్తారు. 28న 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చేనెల 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమనుకుంటే దానిపై ఎస్‌ఈసీ నిర్ణయిస్తుంది. 

రెండోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ 26న విడుదల చేసి... ఆ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 28 వరకు నామినేషన్లు స్వీకరణ. 29న నామినేషన్ల పరిశీలన. సాయంత్రం 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 30న అప్పీళ్లు స్వీకరించి, మే1న వాటి పరిష్కారం. 2వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. అనంతరం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన. వచ్చేనెల 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్‌. 30న తుదివిడత నోటిఫికేషన్‌ వెలువడ్డాక... 3 రోజుల పాటు అంటే మే 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 3న నామినేషన్ల పరిశీలించి సాయంత్రం 5 తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 4న అప్పీళ్ల స్వీకరణ, 5న వాటి పరిష్కారిస్తారు. మే 6వ తేదీ 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 14న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల లోపు తుది విడత పోలింగ్‌.  

బ్యాలెట్‌ బాక్స్‌లతోనే ఎన్నికలు... 
పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే పరిషత్‌ ఎన్నికలను ఎస్‌ఈసీ నిర్వహిస్తోంది. ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికలు జరపాలని తొలుత ఎస్‌ఈసీ భావించింది. అయితే ప్రస్తుతం వివిధ దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో ఈవీఎంల అవసరం, వాటి సంరక్షణ వంటి అంశాల నేపథ్యంలో పేపర్‌ బ్యాలెట్‌తోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపీటీసీ) గులాబీ రంగు, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (జడ్పీటీసీ) తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లను వినియోగించనున్నారు.

రాజకీయ పార్టీల గుర్తుల (పార్టీల ఎన్నికల చిహ్నాలతో)పై ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా పోటీచేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల కోసం ముందు జాగ్రత్తగా 100 గుర్తులను అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో (హైదరాబాద్‌ మినహాయించి) 1.57 కోట్ల మంది గ్రామీణ ఓటర్లున్నారు. తాజాగా మరో మూడు లక్షల మంది వరకు ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement