సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత పరిషత్ నోటిఫికేషన్ విడుదల చేసి మే రెండో వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) చేసిన సూచనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ వెలువరించనున్నట్లు సమాచారం. శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ‘పరిషత్’ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికనుగుణంగా ఎస్‌ఈసీ కూడా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ఫలితాలను మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారు.
రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతిచ్చింది. ఇటీవల ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు ఈసీ లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ జారీచేసి, మూడు విడతల్లో ఎన్నికలు ముగించేందుకు ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం రెండు విడతల్లోనే పూర్తి చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. పరిషత్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల విధుల కోసం ఇప్పటికే ఆర్డర్లు అందుకున్న టీచర్లకు ఈనెల 15 నుంచి 26వ తేదీ లోగా ఏదో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎన్నికల విధులు అప్పగించిన గ్రామ, మండల స్థాయి సిబ్బందికి కూడా శిక్షణను పూర్తిచేస్తారు.
లోక్‌సభ పోలింగ్ ముగియడంతో...
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ‘పరిషత్’ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ పూర్తి దృష్టిని కేంద్రీకరించింది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులపై నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎన్నికల తయారీకి చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లతో సమీక్షిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికల సన్నద్ధత, స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి, తదితర అంశాలపై సమీక్షకు ఈ నెల 15న సీఎస్, డీజీపీలతో ఎన్నికల ఏర్పాట్లపై.. 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఈవోలతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
వచ్చే నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున ఆ లోగానే పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఫలితాలు వెలువడ్డాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల, నక్సల్స్, శాంతిభద్రతల సమస్యలు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో నోటిఫికేషన్ విడుదలకు మధ్యలో మూడు రోజుల అంతరం ఉంటుంది.
22న తొలి నోటిఫికేషన్...
ఈ నెల 20న పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లుగా పరిగణిస్తారు. ఈ జాబితాను ప్రకటించిన ఒకట్రెండు రోజుల్లోనే... అంటే ఈ నెల 22న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మొదటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనిని బట్టి తొలి విడత పరిషత్ ఎన్నికలు మే 6న ఉంటాయి. 26న రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే...మే 10న ఎన్నికలు జరుగుతాయి. 30న తుది విడత నోటిఫికేషన్ విడుదల చేస్తే మే 14న ఎన్నికలుంటాయి.
జూలై 4తో ముగియనున్న పదవీకాలం...
వచ్చే జూలై 3, 4 తేదీల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. వచ్చేనెల 27 వరకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఆ లోగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను ముగిస్తే, మరోసారి కోడ్ విధించాల్సిన అవసరం ఉండదన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పరిషత్ ఎన్నికలను పూర్తి చేయనున్నారు. ఫలితాలు మాత్రం లోక్‌సభ రిజల్ట్ వెలువడ్డాకే ప్రకటిస్తారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఆ తర్వాతే జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment