* తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ
* రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం
* రెండు నెలల్లో అందుబాటులోకి కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేయనున్న కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112కు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ ఇటీవల అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతమున్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నెంబర్ల స్థానంలో దేశ వ్యాప్తంగా 112ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అత్యవసర స్పందన వ్యవస్థ (ఎన్‌ఈఆర్‌ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం మొదట గుజరాత్, తెలంగాణను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.100 కోట్ల విలువైన సాంకేతిక పరికరాలను అందించనుంది. దీని ద్వారా అత్యవసర సేవలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు అమల్లోకి రానుంది.
కేంద్రానిదే నిర్వహణ ఖర్చు..: పోలీస్, మెడికల్, అగ్నిమాపక తదితర సేవల కోసం ప్రస్తుతం వేర్వేరు నంబర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నంబర్ ఉంటోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఒకే నంబర్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రమే సమకూర్చనుంది. జీపీఎస్ ఆధారంగా ఆపదలో ఉన్న వారి దగ్గరికి దగ్గర్లోని పోలీసులను పంపిస్తారు. ఇదంతా నిమిషాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది.
రాష్ట్రానికి డబ్బులు ఆదా..: నేరాలను అరికట్టడం, ప్రజలకు సమర్థమైన పోలీసు సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త వాహనాలు, స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చు ట్టింది. పోలీసు వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను పొం దుపరిచి ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే వారి దగ్గరికి క్షణాల్లో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కూడా మం జూరు చేసింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టి ఎమర్జెన్సీ నంబర్ 112 ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ భావాలకు అనుగుణంగా ఉండటం, నిర్వహణ ఖర్చులను కేం ద్రమే భరించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పోలీసు శాఖ వెనక్కి పంపించింది.
112 అమలుకు తెలంగాణ ఎంపిక
Published Fri, Dec 4 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement
Advertisement