
డివైజ్ రూపకర్తలను అభినందిస్తున్న వెంకయ్య నాయుడు (ఫైల్)
కుత్బుల్లాపూర్: హైటెక్ నగరం.. ఉరుకులు పరుగుల జీవనం.. ఉద్యోగం.. వ్యాపారం.. పని ఏదైనా క్షణం తీరిక లేకుండా పో తోంది. ఇంట్లో పెంచుకునే పెట్స్ హెల్త్, ఫుడ్, గ్రూమింగ్ ఇలా అన్ని అంశాలలో జాగ్రత్తలు తీసుకోవడానికి సరైన సమయం కేటాయించలేని పరిస్థితి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ‘పెట్ మంచ్’ డివైజ్‌ను రూపొందించారు.
స్మార్ట్ పెట్.. ఫుడ్ డిస్పెన్సర్..
పెంపుడు జంతువులకు సరైన సమయంలో ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు తార్నాకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రాంవర్ధన్, నవ్య సుస్మిత, ప్రత్తిపాటి చైతన్య శేష మనోజ్‌లు. ఆ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ‘పెట్ మంచ్’ (స్మార్ట్ పెట్ ఫుడ్ డిస్పెన్సర్) డివైజ్‌కు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. తేలికపాటి మోటార్, వెయిట్– లెవల్ సెన్సార్, డిజిటల్ క్లాక్, ఓ డిస్పెన్సర్‌తో తొలుత బేసిక్ ‘పెట్ మంచ్’ పరికరాన్ని రూపొందించారు. డిజిటల్ క్లాక్‌లో టైమ్‌సెట్ చేసి డిస్పెన్సర్‌లో డాగ్ ఫీడ్‌ను ఉంచితే అనుకున్న సమయానికి బౌల్‌లో పడిపోతుంది.
యాప్ ద్వారా రిమోట్ మానిటరింగ్..
డిస్పెన్సర్‌కు ఐఓటీ బేస్‌డ్ ట్రాన్స్‌మీటర్, రిసీవర్‌ను అమర్చడంతో పాటు పెట్ డాగ్ కాలర్‌కు వేరియబుల్ డివైజ్‌ను అమర్చి దాన్ని క్లౌడ్ ఇంటర్‌ఫేస్‌తో అనుసంధానం చేశారు. అలాగే యాప్‌ను రూపొందించి క్లౌడ్ ఇంటర్‌ఫేస్ ద్వారా వచ్చే సమాచారాన్ని యాప్ ద్వారా మొబైల్‌కు చేరవేసేలా తీర్చిదిద్దారు. పెట్ డాగ్‌కు ఎంత పరిమాణంలో ఫుడ్ ఇవ్వాలి, అది తిన్నదా లేదా, మళ్లీ ఎంత సమయంలో ఇవ్వాలి తదితర పనులు యాప్ ద్వారా చేయవచ్చు. ఇక పెట్ డాగ్ హైట్, వెయిట్‌ను అనుసరించి అది ఎంత బరువు ఉండాలి, అది తిన్న ఫుడ్‌కు ఎంత వర్కవుట్ చేయించాలి తదితర హెల్త్ మానిటరింగ్ అంశాలు నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. దీంతో పెంపుడు కుక్క ఓబెసిటిని సైతం నియంత్రించవచ్చు.
జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో..
వీరు రూపొందించిన పెట్ మంచ్ డివైజ్ ఐఐటీ మద్రాస్ ఈ– సమ్మిట్‌లో వచ్చిన 600 ఎంట్రీల్లో టాప్– 8లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐఐఎం బెంగళూర్ వారు నిర్వహించిన ‘ఇండియన్ ఇన్నోవేషన్ చాలెంజ్ అండ్ డిజైన్ కాంటెస్ట్’లో వచ్చిన 10,348 ఎంట్రీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికైన 346 ప్రాజెక్ట్‌ల్లో పెట్‌మంచ్ స్థానం సంపాదించింది. అదే విధంగా జాతీయ స్థాయిలో జరిగిన మరో నాలుగు ప్రాజెక్ట్ ఎక్స్‌పోలలో వరుసగా టాప్– 4లో నిలవడం విశేషం. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల నగరానికి వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వీరి డివైజ్‌ను చూసి అభినందించారు. మనుషులకు కూడా ఇలాంటి డివైజ్‌లు రూపొందిస్తే జనాభాలో అధిక శాతమున్న ఊబకాయులకు ప్రయోజనం చేకూరుతుందని చమత్కరించారు.
త్వరలో మార్కెట్‌లోకి తీసుకొస్తాం..
దాదాపు రెండేళ్లుగా ఈ డివైజ్ రూపకల్పనకు సమష్టిగా కృషి చేశాం. సర్వేలో వచ్చిన సలహాలు, సూచనలతో ఇప్పటికే దీనిలో మార్పులూ చేర్పులూ చేశాం. ఇంకా ఈ పరికరానికి తుది రూపు ఇవ్వాల్సిఉంది. కేవలం శునకాలకే కాకుండా ఆవులు, గేదెలు, పెట్ బర్డ్స్‌కు సరిపోయేలా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. పెట్ మంచ్ డిస్పెన్సర్ రూ. 20 వేల నుంచి రూ.23 వేల లోపు ధరలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కొద్ది నెలల్లో మార్కెట్‌లోకితీసుకొస్తాం. – రాంవర్ధన్, నవ్య సుస్మిత, చైతన్య శేష మనోజ్
Comments
Please login to add a commentAdd a comment