సాక్షి, సిరిసిల్ల : తెలంగాణలో అరాచక శక్తుల కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో గురువారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘దిశ’ ఘటన దారుణమైందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ పటిష్టమైన ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు.
ఊరూరా మహిళా కమిటీలు వేస్తామని, తాగుబోతులు ఎవరు, తిరుగుబోతులు ఎవరో గుర్తించి ముందే పోలీసులకు పట్టిచ్చేలా సీఎం ఆలోచన చేస్తున్నారని చెప్పారు. స్వశక్తి సంఘాలకు వడ్డీ మాఫీ కోసం రూ.2,196 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. వేములవాడలో మహిళా సంఘాలకు రూ.10 కోట్ల రుణాల చెక్కులను, మహిళలకు లోన్‌కార్డులను, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment