దొంగే.. దొంగ అన్నట్టుంది
హైదరాబాద్ : రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగ...దొంగ అని అరుస్తున్నట్లుగా తెలంగాణ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విమర్శలు చేయటం సరికాదన్నారు. టీడీపీ నేతల బస్సు యాత్రల చేస్తూ రైతుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులపై అంత ప్రేముంటే వారిని ఆదుకోవాలని ఈటెల ఈ సందర్భంగా టీడీపీ నేతలకు సూచించారు.
రైతులకు లోన్లు తిరస్కరించవద్దని బ్యాంకర్లను కోరినట్లు ఈటెల తెలిపారు. బ్యాంకులు లోన్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. రేషన్ కార్డుల జారీలో గత ప్రభుత్వాల విధానాలే అవలంభిస్తున్నామని ఈటెల చెప్పారు. నక్సల్స్తో చర్చల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. నక్సల్స్ వల్లే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ రావటం లేదని తాము అనలేదని ఈటెల తెలిపారు.