ఇష్టారాజ్య వసూళ్లు కుదరదు!  | Etela Rajender Meeting With The Surveillance Committee Over Corona Virus | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్య వసూళ్లు కుదరదు! 

Published Fri, Mar 6 2020 3:05 AM | Last Updated on Fri, Mar 6 2020 3:05 AM

Etela Rajender Meeting With The Surveillance Committee Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైద్యం పేరుతో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా సర్కారు అడ్డుకట్ట వేసింది. కోవిడ్‌ వైరస్‌ లక్షణాలతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేసేందుకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తారన్న ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ అనుమానంతో ఎవరైనా చేరి చికిత్స పొందేంత వరకు ఆస్పత్రి వర్గాలు ఎంత ఫీజు వసూలు చేస్తాయన్న దాంతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే ఒకవేళ వారికి కోవిడ్‌ ఉన్నట్లు తేలితే తదుపరి చేసే వైద్యానికి ఫీజును తామే ఖరారు చేస్తామని, ఆ ప్రకారమే వసూలు చేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ఉన్న ప్రముఖమైన కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా మొత్తం 70–80 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. కోవిడ్‌ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని నిర్ణయించారు.

ఆదేశాల మేరకే నడుచుకోవాలి.. 
కోవిడ్‌ చికిత్స విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను, ప్రొటోకాల్‌ పద్ధతులను వారికి మంత్రి వివరించారు. కోవిడ్‌ ఐసోలే షన్‌ వార్డుల ఏర్పాటులో ఎలాంటి విధానాలు పాటించాలి.. వైద్య సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి.. ప్రధానంగా శాంపిల్స్‌ సేకరణ, క్వా రంటైన్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను ఆస్పత్రులకు వివరించారు. కోవిడ్‌ అనుమానిత కేసులు వస్తే వారికి అందించే చికిత్స విషయం లో ఎంత ఫీజు వసూల్‌ చేయాలన్నది తామే నిర్ధారించి వెల్లడిస్తామని తెలిపారు. అలాగే ఓపీలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు వివరించారు. ప్రధానంగా కోవిడ్‌ బాధితులు, రోగుల విషయంలో తమ ఆదేశాల మేరకే నడుచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి జిల్లా నుంచి 10 మంది సిబ్బంది
కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో పని చేసేందుకు ప్రతి జిల్లా నుంచి 10 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేశారు. వారంతా గురువారం రిపోర్టు చేశారు. ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రులు కరోనా విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపై ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేం ద్రం తన కార్యాకలాపాలను ప్రారంభించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టే చర్యల విషయంలో రోజూ ఉదయం 10 గంటలకు స మావేశం కావాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రోజువారీ కార్యాచరణను సిద్ధం చేయనుంది. ఇప్పటికే ఆరు కమిటీలను కూ డా వేసింది. గురువారం మంత్రి ఈటల రా జేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉన్నతాధికారులతో సమావేశమయ్యా రు. కోవిడ్‌పై చేపట్టిన చర్యలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

సర్వైలైన్స్‌ కమిటీతో ఈటల సమావేశం 
కాగా, బుధవారం వేసిన ఆరు కమిటీల సభ్యులకు సంబంధించిన వివరాలపై గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరు కమిటీల్లో ఒకటైన సర్వైలెన్స్‌ కమిటీ సభ్యులతో గురువారం మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలో అధికారులకు ఆయన వివరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసే సిబ్బందికి అదనపు వేతనం, సర్టిఫికెట్‌ ఇస్తామని తెలిపారు. కాగా, కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలపై రాష్ట్ర సర్కారు సన్నద్ధతపై తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కొన్ని రోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉంటుంది. గురువారం గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రులను సందర్శించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా కోవిడ్‌ ఏర్పాట్లపై పర్యవేక్షించింది.

కేరళకు వైద్య బృందం.. 
కేరళకు 10 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం గురువారం వెళ్లింది. వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న చికిత్స, వైద్య విధానాలపై అధ్యయనం చేయనుంది. దీంతో పాటు విమానాశ్రయాల్లో ఎటువంటి స్క్రీనింగ్‌ చేస్తున్నారు.. కంట్రోల్‌ రూం నిర్మాణం, కాల్‌సెంటర్‌ పనితీరు, పలు కమిటీల ఏర్పాటు, కమ్యూనిటీ స్ట్రాటజీ, ఐసోలేషన్‌ సౌకర్యాలు, కేసును డీల్‌ చేసిన వైద్య బృందంతో చర్చలు జరుపుతుంది. 3 రోజుల పాటు అధ్యయనం చేసి 8న తిరిగివస్తారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు శుక్ర వారం ఆరుగురు సభ్యుల వైద్య బృందాన్ని కోవిడ్‌పై ప్రత్యేక శిక్షణ కోసం ఢిల్లీకి పంపిస్తున్నారు. కాగా, గాంధీ ఆస్పత్రి నుంచి కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులను ఎత్తివేయాలని గాంధీ మెడికల్‌ కాలేజీకి చెందిన తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అందులో చికిత్స పొందుతున్న అనుమానితులు, రోగులను వికారాబాద్‌ టీబీ ఆసుపత్రికి తరలించాలని కోరింది.

ఆస్పత్రులకు మార్గదర్శకాలివే.. 
►ప్రతి ఆస్పత్రిలో కోవిడ్‌ అవగాహన సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయాలి. 
►ఫ్లూ లక్షణాలతో వచ్చే వారికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. 
►రోగి ప్రయాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. 
►విదేశీ ప్రయాణికులు, వారితో కలిసి, లక్షణాలున్న ప్రతివారి వివరాలను కచ్చితంగా రికార్డు చేయాలి. 
►ఏదైనా ఆస్పత్రిలో అలాంటి లక్షణాలతో చేరితే, ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపాలి. 
►శాంపిల్స్‌ సేకరణ, వాటి రవాణా, ఐసో లేషన్‌ వార్డుల ఏర్పాటులో కచ్చితంగా ప్రొటోకాల్‌ ప్రకారం నడుచుకోవాలి. 
►ఆస్పత్రులన్నీ తమ వైద్య సిబ్బందికి వ్యక్తిగత శుభ్రతతో పాటు రక్షణ చర్యలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
►ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి నివారణలో ప్రతి ఆస్పత్రి కచ్చితమైన విధానాలు పాటించాలి. 
►వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement