వాటర్ గ్రిడ్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు అని, దీని పనుల కోసం జాతీయస్థాయిలో ప్రకటనలు ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్: వాటర్ గ్రిడ్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు అని, దీని పనుల కోసం జాతీయస్థాయిలో ప్రకటనలు ఇచ్చి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారకరామారావు అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ నుంచి సిబ్బందిని తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేసేందుకు ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 592 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రాజెక్టులో పనిచేయనున్న అధికారులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణనిచ్చి, ప్రాజెక్టు ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వాటర్‌గ్రిడ్ లైన్ సర్వే వివరాలు త్వరలోనే అందనున్నాయని, ప్రాజెక్టు నిమిత్తం అవసైరమెన ప్రాంతాల్లో భూసేకరణ వివరాలను ఒకట్రెండు రోజుల్లో అందజేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు స్థితిగతులపై తనతో పాటు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని మంత్రి తెలిపారు.
డిసెంబర్‌లో పైలాన్ ఆవిష్కరణ
మొదటి దశలో చేపట్టనున్న ఆరు గ్రిడ్ల కోసం జనవరి 30నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఫిబ్రవరి 10 నుంచి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్‌లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పైలాన్‌ను మునుగోడులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.