
డీఎస్సీ–1998 అక్రమాలపై వివరణ ఇవ్వండి
పాఠశాల విద్యాశాఖ, వరంగల్ అర్బన్ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–1998లో అక్రమాలు జరిగాయని సీనియర్ ఐఏఎస్ అధికారి సారథ్యం లోని ఉన్నత స్థాయి కమిటీనిర్ధారించినా నేటికీ నివారణ చర్యలు చేపట్టలేదన్న వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన కె.వేణు, ఎన్.రమేశ్ మరికొందరు యు వకులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి గురువారం విచారించారు. డీఎస్సీ–1998లో అక్రమాలు జరిగాయని ఉన్నతస్థాయి కమిటీ 2004లో నిర్ధారించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.ఎస్.అర్జున్ కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు.
కోర్టు ఆదేశాల ఉన్నాయని చెప్పి సున్నా మార్కులు సాధించిన వి.మేరీకి ఇంటర్వ్యూలో నాలుగే మార్కులు వచ్చినా సెకండ్ గ్రేడ్ టీచర్‌గా (ఎస్‌జీటీ) ఎంపి క చేశారన్నారు. వాస్తవానికి కోర్టు ఆదేశాలు లేవని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా అధికారులు చెబుతున్న ఆ కోర్టు తీర్పు ప్రతిని మాత్రం ఇవ్వడం లేదన్నారు. వరంగల్ డీఎస్సీ చైర్మన్ (కలెక్టర్), డీఈవోల అనుమతి లేకుండానే 65 మంది ఎస్‌జీటీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో డీఎస్సీ–1998 అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... తెలంగాణ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్, వరంగల్ అర్బన్ జిల్లా డీఎస్సీ చైర్మన్, డీఈవోలకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.