సదుపాయాలు కల్పిస్తే తప్పేంటి? | Facilities For Fish Medicine Distribution Not Objectionable Says High Court | Sakshi
Sakshi News home page

సదుపాయాలు కల్పిస్తే తప్పేంటి?

Published Wed, Jun 5 2019 8:41 AM | Last Updated on Wed, Jun 5 2019 8:41 AM

Facilities For Fish Medicine Distribution Not Objectionable Says High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేప ప్రసాదంకోసం పెద్ద సంఖ్య లో జనం వస్తున్నప్పుడు ప్రభుత్వం వారికి కనీస సదుపాయాల్ని కల్పిస్తే తప్పేమిటని హైకోర్టు ప్రశ్నిం చింది. ‘ఏదైనా ప్రదేశానికి వేల మంది ప్రజలు వస్తున్నప్పుడు ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని, నిర్వాహకులే చూసుకుంటారని వదిలేయాలా? తొక్కిసలాట లాంటి జరగకూడనిది జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహించాలి. అప్పుడు మళ్లీ కోర్టుకు వచ్చి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, మృతుల కుటుంబసభ్యులకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలంటూ వ్యాజ్యాలు వేస్తారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైదరాబాద్‌లో ఏటా మృగశిరకార్తెకు బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాద పంపి ణీకి ప్రభుత్వం ఉచిత ఏర్పాట్లు చేయడాన్ని తప్పుపడుతూ బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పైవిధంగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రైవేటు వ్యక్తులు నిర్వ హించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే, మౌఖిక ఆదేశాలతో ప్రజాధనాన్ని వెచ్చిస్తోందని బాలల హక్కుల సంఘం పిల్‌ దాఖ లు చేసింది. దీనిపై ధర్మాస నం స్పందిస్తూ వేసవి ఎండ లు తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో నీడకోసం టెంట్లు వేయడం, మంచినీటి వసతి, అత్యవసర వైద్య సేవలు, రక్షణకోసం పోలీసులను విని యోగిస్తే తప్పేమిటో, ఇది చట్ట వ్యతిరేకం ఎలా అవుతుందో చెప్పాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, పోలీస్‌ రక్షణ, వసతుల్ని ప్రభుత్వమే కల్పిస్తుందని, ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతోందో తెలపాలని ధర్మాసనం కోరింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ ఫీజు కూడా నిర్వాహకులు కాకుండా ప్రభుత్వం చెల్లిస్తోందని పిటిషనర్‌ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి  చెప్పారు. ప్రభుత్వ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌ చెప్పడంతో విచారణ 7వ తేదీకి వాయిదా పడింది. కాగా, 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ : బత్తిని హరినాథ్‌గౌడ్‌ 
హైదరాబాద్‌: ప్రతి ఏట మాదిరిగానే ఈసారి కూడా మృగశిరకార్తె సందర్భంగా ఈనెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని బత్తిని హరినాథ్‌గౌడ్‌ వెల్లడించారు. దాదాపు ఐదు లక్షల మంది ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉండటంతో 32 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జనసేవాసంఘ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో హరినాథ్‌గౌడ్‌ మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని, సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 8న శనివారం సాయం త్రం ఆరు నుంచి 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలనుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదంకోసం రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో జనసేవాసంఘ్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ పాండే, పరమానందశర్మ, వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement