పోలీసుల అదుపులో నిందితులు
నగరంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని వారికి ఏమాత్రం అనుమానం రాకుండా మోసాలకు తెగబడుతున్నారు. సాధారణంగా మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు. కానీ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన గ్యాంగ్ మాత్రం 90 మందిని టార్గెట్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పి మెట్రో నగరాలకు తరలించి శిక్షణ సైతం ఇచ్చింది. ఇందుకోసం వారి నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ ముఠాలో ఆరుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్ చదివినవారు సైతం ఉన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.
–సాక్షి, సిటీబ్యూరో
సాక్షి,సిటీబ్యూరో : సాధారణంగా మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు. అయితే సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన గ్యాంగ్ మాత్రం మరో అడుగు ముందుకు వేసింది. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఆయా అభ్యర్థులను మెట్రో నగరాలకు తరలించి శిక్షణ సైతం ఇచ్చింది. ఈ పంథాలో దాదాపు 90 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసిన మోసం చేసిన ముఠాలో ఆరుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్ గ్రాడ్యుయేట్లు సైతం ఉన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.
ఇన్‌స్టిట్యూట్ కలిపింది ఐదుగురినీ...
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మారం మోహన్ 2016లో అమీర్‌పేట ప్రాంతంలో ఎంవీ ఎం టెక్నాలజీస్ పేరుతో జాబ్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడి ద్వారా అదే జిల్లాకు చెం దిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రణయ్ రాహుల్, ఎల్బీనగర్, ఎస్సార్ నగర్‌లకు చెందిన బీటెక్ పట్టభద్రు లు నరేష్ కుమార్, వెంకట నర్సింహ్మ, శ్రవణ్ ఇదే సంస్థ గూటికి చేరారు. కొన్నాళ్ల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైన వీరు తామే ‘ఉద్యోగాలు ఇవ్వాలని’ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి వలసవచ్చి మూసాపేట, బేగంపేట ప్రాంతాల్లో స్థిరపడిన సెక్యూరిటీ సంస్థ ఉద్యోగులు ప్రసన్నకుమార్, మురళి, హబ్సిగూడకు చెందిన అశోక్ రావ్‌లను త మ ముఠాలో చేర్చుకున్నారు. వీరు ఎనిమిది మం దీ కలిసి తొమ్మిది నెలల క్రితం ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, రైల్వేలో టీసీ, రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్స్, నేషనల్ రూరల్ హెల్త్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులో సిస్టమ్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేశారు.
ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలు
సోషల్‌మీడియాతో పాటు ఈ–మెయిల్స్ రూపం లో, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా వీరి ‘ఉద్యోగ ప్రకటన’ ప్రాచుర్యం పొందింది. దీంతో అనేక మంది వీరిని సంప్రదించగా... ఒక్కో పోస్టుకు గరి ష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని ఒప్ప ందం చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి నగదు తీసుకున్న తర్వాత వెంకటేష్ వీరికి ఇంటర్వ్యూ లెటర్స్ ఈ–మెయిల్ చేసేవాడు. ఇందుకుగాను ఆయా విభాగాలను పోలిన మెయిల్ ఐడీలు (అనానమస్ ఐడీస్) సృష్టించాడు. ఐటీ శాఖలో ఉద్యోగాల పేరుతో ఈ లెటర్స్ అందుకున్న వారిని ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌తో పాటు వైజాగ్, బెంగళూరు, మైసూరు, కొచ్చిన్, కోల్‌కతా, న్యూ ఢిల్లీల్లోని ఆయకార్ భవన్ వద్దకు రప్పించేవారు. ఎస్బీఐ ఉద్యోగార్థులను గన్‌ఫౌండ్రీలోని మెయిన్ బ్రాంచ్‌కు పిలిపించే వారు. అభ్యర్థులను లాబీలు, రిసెప్షన్ ఏరియాల్లో కలిసే రాహుల్ తాను సదరు విభాగం తరఫున ఇంటర్వ్యూ చేసే అధికారినంటూ పరిచయం చేసుకునే వాడు. అక్కడే ఇంటర్వ్యూ తంతు పూర్తి చేసి పంపేవాడు. ఆపై వీరికి నియామక పత్రాలు సైతం ఈ–మెయిల్ చేసేవాడు.
ఉత్తుత్తి శిక్షణ..
బ్యాంకు ఉద్యోగాలకు ‘ఎంపికైన వారికి’ ఈ గ్యాంగ్ శిక్షణ శిబిరాలు సైతం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, బెంగళూరు, మైసూరు, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీలోని హాస్టళ్లను అద్దెకు తీసుకునే వీరు వాటినే బోగస్ స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్స్‌గా మార్చేశారు. అక్కడే ‘ఎంపికైన ఉద్యోగులకు’ 45 రోజుల పాటు మోహన్, శ్రవణ్ పర్యవేక్షలో శిక్షణ కూడా ఇచ్చేవారు. ఈ తంతు ముగిసిన తర్వాత ఫలానా బ్యాంక్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు వెళ్లి జాయినింగ్ లెటర్‌పై సంతకం చేయాల్సిందిగా చెప్పే ముఠా సభ్యులు వారికి తమ ముఠాకు చెందిన వారి నెంబర్లే ఇచ్చేవారు. వీరు ఆ సంస్థ వద్దకు వెళ్లేలోగానే గ్యాంగ్ సభ్యులు మురళి, ప్రసన్న తదితరులు అక్కడి లాబీల్లో కాచుకుని కూర్చునేవారు. సదరు అభ్యర్థులు వెళ్లి వీరిని సంప్రదించగా... జాయినింగ్ ఆర్డర్స్ పేరుతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని పంపేవారు. అనంతరం బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో ‘అంతర్గత కారణాల నేపథ్యంలో మీ నియామకాన్ని కొన్నాళ్లు హోల్డ్‌లో పెడుతున్నాం’ అంటూ సందేశాలు పంపేవారు.
విదేశాల్లో గ్యాంగ్ లీడర్ జల్సాలు...
ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆయా అభ్యర్థుల్ని పూర్తిగా దూరంగా ఉంచడం, మళ్లీ మళ్లీ వాయిదాలు వేయడం చేసేవారు. ఇలా దాదాపు 90 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ సొమ్ములో అత్యధిక శాతం తీసుకున్న వెంకటేష్ థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్, మాల్దీవ్స్ తదితర విదేశాలకు వెళ్లి జల్సా చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సిటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప దాడులు నిర్వహించి మోహన్, అశోక్ మినహా మిగిలిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదు, 44 గ్రాముల బంగారం, బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment