ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్‌లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.