సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి విజృంభిస్తున్న కేసులు నిత్యం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాలో 26కు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం వరకు 21 కేసులు ఉండగా.. ఆ రాత్రి పొద్దుపోయాక మరో పాజిటివ్ వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీళ్లలో ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లందరూ మత ప్రార్థనల కోసం ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చినవారని అధికారులు ధ్రువీకరించారు.
జల్‌పల్లి మున్సిపాలిటీలో..
ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. జల్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మత ప్రార్థనలకు ఢిల్లీకి వెళ్లొచ్చాడు. తొలుత అతడికి ముందే కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈనెల 2వ తేదీన వీరి నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈమేరకు ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. అతడి భార్య, కుమారుడు, కుమార్తెకు సైతం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందడంతో పాజిటివ్ వచ్చింది.ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతోనే ఆయన నుంచి వీరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ ముగ్గరు కూడా ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. మరికొందరు సభ్యులకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు వీరే కావడం గమనార్హం. మరొకరు హఫీజ్‌పేటకు చెందిన వ్యక్తి అని అధికారులు తెలియజేశారు.
చేగూరులో కలకలం..
కరోనా వైరస్‌తో ఓ మహిళ మృతిచెందిన నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆదివారం కలకలం రేగింది. కరోనా లక్షణాలు మరో ఇద్దరిలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికుల్లో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అయితే ఎవరిలోనూ లక్షణాలు లేవని వైద్యఆరోగ్య అధికారులు ఈమేరకు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారిద్దరూ ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన వారేనని, వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. అసత్య ప్రచారాలు చేయవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి జిల్లావాసులకు విజ్ఞప్తి చేశారు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు కృషి చేయాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దన్నారు. అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment