
ప్రతీకాత్మక చిత్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వాహనదారుల్లో ఫ్యాన్సీ నంబర్లపై అమితాసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లా రవాణాశాఖకు కాసుల వర్షం కురుస్తోంది. లక్షలు పోసి కొనుగోలు చేసిన వాహనం కోసం మెచ్చిన నంబర్ ఉండాలని భావిస్తున్న కొందరు భారీగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. పెద్ద పెద్ద వాహనలకే కాదు, ద్విచక్ర వాహనాలకు కూడా ఫ్యాన్సీ నంబర్ కోసం వేల రూపాయలు చెల్లిస్తున్నారు.
మరోవైపు రూ.50 వేల కేటగిరీతో ఉన్న 9999 నంబర్‌ను దక్కించుకునేందుకు రియల్టర్లు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈక్రమంలో ఒకే నంబర్ కోసం పోటీ వారికి ఆర్టీఏ అధికారులు వేలం నిర్వహిస్తూ.. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి నంబర్ కేటాయిస్తున్నారు. ద్విచక్రవాహనదారులు సైతం తొమ్మిది వచ్చేలా(అన్ని అంకెలకు కూడితే) చూసుకుంటున్నారు.
ఇందుకోసం ముందుగానే తమకు నచ్చిన నంబర్లను సొంతం చేసుకునేందుకు రిజర్వేషన్ చేసుకుంటుండటంతో జిల్లా కార్యాలయంలో ఓపెన్ బిడ్ నిర్వహిస్తున్నారు. ఈ బిడ్‌లో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికే నెంబర్ కేటాయిస్తున్నారు.
రూ.3 లక్షలతో ఫ్యాన్సీ నంబర్
సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉండగా.. వాటి పరిధిలో వాహనదారులు ముందుగానే ఫ్యాన్సీ నంబర్ల కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, 2016–17 సంవత్సరానికి గాను ఈ ఆదాయం రూ.23,61,440 రాగా, 2017–18లో ఫ్యాన్సీ నంబర్లను 1,472 వాహనాలకు కేటాయించారు.
దీంతో జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి రూ.60,02,875 ఆదాయం వచ్చింది. ఇలా ఒక్క సంవత్సరంలోనే రూ.37 లక్షలు ఆదాయం ఫ్యాన్సీ నంబర్ల ద్వారా జిల్లా రవాణాశాఖకు చేరింది. అత్యధికంగా టీఎస్ 36ఎ 9999 వాహనానికి రిజర్వేషన్ రూ.50,000తో పాటు ఓపెన్ బిడ్‌లో రూ.3,26,000 చెల్లించి జిల్లాకు చెందిన ఓ మహిళ సొంతం చేసుకున్నారు.
అలాగే టీఎస్ 36ఎ 6666 వాహనానికి రిజర్వేషన్ రూ.30,000తో పాటు ఓపెన్ బిడ్‌లో రూ.1,12,500 చెల్లించి మరో మహిళ సొంతం చేసుకున్నారు. జిల్లాలో వందల సంఖ్యల్లో వాహనాలు నిత్యం రిజిస్ట్రేషన్‌లు జరుపుకుంటుండగా.. వీటికి ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు.
మా అన్ని వాహనాలకు 3456
మాకున్న నాలుగు కార్లకు ఒకే నంబర్లు ఉండేలా 3456 నంబర్ కోసం ఓపెన్ బిడ్‌లో పాల్గొన్నాం. ఇందుకోసం ముందుగానే రూ.20,000 చెల్లించి నంబర్‌ను రిజర్వ్ చేసుకున్నాం. అన్ని కార్లకు ఒకే నంబర్ ఉండటం ఒకరకంగా హోదాగా ఉంటుంది.
– రోహిత్ యాదవ్, సిద్దిపేట
ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ
వాహనదారుల్లో ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ పెరుగుతోంది. దీంతో ఎంత ఖర్చు చేసేందుకు అయినా రెడీ అవుతున్నారు. 2017–18 సంవత్సరానికి 1,472 మంది వాహనదారులు వారు కోరుకున్న నంబర్లు చేజిక్కించుకున్నారు. దీంతో రవాణాశాఖకు రూ.60,02,875 ఆదాయం వచ్చింది. ఖరీదైన వాహనాలకే కాదు, ద్విచక్ర వాహనాలకు సైతం ఫ్యాన్సీ నంబర్లు ఉండేలా వాహనదారులు కోరుకుంటున్నారు.
– రామేశ్వర్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి
జిల్లాలో ఫాన్సీ నంబర్ల ధరలు..
- రూ.50వేల కేటగిరి: 0001, 0009, 0999, 9999...
- రూ.30 వేల కేటగిరి: 0099, 0333, 0555, 0666, 0777, 0888...
- రూ.20 వేల కేటగిరి: 0123, 0222, 0369, 0444...
- రూ.10 వేల కేటగిరి: 0003, 0005, 0006, 0007...