తీరని అప్పులు, ఎండిన పంటలు.. ఓ గిరిజన రైతును బలి తీసుకున్నాయి.
నర్సాపూర్ రూరల్ (మెదక్) : తీరని అప్పులు, ఎండిన పంటలు.. ఓ గిరిజన రైతును బలి తీసుకున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ పంచాయతీ బోడగుట్ట తండాలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దేవాసోత్ శంకర్(52)కు రెండెకరాల భూమి ఉంది. అందులో వరి, మొక్కజొన్న సాగుచేశాడు. కొన్నిరోజులుగా బోరు బావి అడుగంటిపోవడంతో నీరు లేక చేతికొచ్చే దశలో ఉన్న వరి ఎండిపోయింది.
రెండుసార్లు బోరు డ్రిల్లింగ్ చేయించినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై రూ.2 లక్షల అప్పును ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం వేకువజామున వరి పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే అటుగా వెళ్లిన రైతులకు విగతజీవిగా కనిపించాడు. అతనికి ముగ్గురు కుమారులు రమేష్, రాజు, రెడ్యా ఉన్నారు.