12గంటలకో రైతు ఆత్మహత్య | Farmer commits suicide in 12 hours | Sakshi
Sakshi News home page

12గంటలకో రైతు ఆత్మహత్య

Published Wed, Mar 11 2015 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

12గంటలకో రైతు ఆత్మహత్య - Sakshi

12గంటలకో రైతు ఆత్మహత్య

శాసనమండలిలో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ

హైదరాబాద్: రాష్ట్రంలో 12 గంటలకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన  మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో పస లేదన్నారు.  పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి మాట్లాడుతూ గోదావరితో చెరువులను అనుసంధానిస్తే పూడికతీత అవసరంలేదన్నారు.
 
దేవదూత కేసీఆర్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు

టీఆర్‌ఎస్ సభ్యుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ ‘ఎస్సీ, ఎస్టీలకు దేవుడి తర్వాత కేసీఆర్ మాత్రమే’ అనగా... అదే పార్టీకి చెందిన రాజలింగం మరో అడుగు ముందుకేసి ‘దేవుడు పంపిన దేవదూత కేసీఆర్’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని వివరణ అడిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు విధివిధానాలు ఖరారు చేయడానికి ఆలస్యమెందుకని విమర్శించారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి దళితులను అవమానించారు: హరీశ్

దీంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ టీపీసీసీ కొత్త అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే హరిజనులు అన్న పదం వాడి దళితులను అవమానపరిచారని విమర్శించారు. తామే దళితులను గౌరవిస్తామన్నారు. సభలో సభ్యులు జనార్దన్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, కె.వెంకటేశ్వర్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, జగదీశ్‌రెడ్డి, వెంకటరావు తదితరులు కూడా మాట్లాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement