
పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో విషాదం
పెద్దేముల్: త్వరలో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. అప్పుల బాధ తాళలేక ఓ వృద్ధరైతు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన పెద్దేముల్ మం డలం లింగంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మండల వెంకట్‌రెడ్డి(70)తనకున్న రెండెకరాల 32 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు బందిరెడ్డి ఉన్నారు. గతంలో బందిరెడ్డి చనిపోవడంతో వెంకట్‌రెడ్డి తన చిన్న కూతురు చిన్న కుమార్తె మమతను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాడు. ఆమె వివాహ బాధ్యతను కూడా తీసుకున్నాడు. కొన్నేళ్లుగా పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రైతు కోటపల్లి ఆంధ్రా బ్యాంకులో రూ. 40 వేలు, తెలిసిన వారి వద్ద మరికొంత డబ్బు మొత్తం రూ. 4 లక్షలు తీసుకున్నాడు.
ఇటీవల తనకున్న పొలంలోంచి ఎకరం భూమిని రూ. 4 లక్షలకు అమ్మేశాడు. మమతకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఘనంగా వివాహం చేద్దామని భావించాడు. పొలానికి సంబంధించిన డబ్బు సమయానికి అం దలేదు. సదరు డబ్బు వచ్చినా అప్పుల వారికి సరిపోతుందని, ఇక మనవరాలి పెళ్లి ఎలా చేద్దామని వెంకట్‌రెడ్డి వారం రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు.
ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాత ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఉదయం మమత పొలానికి వెళ్లి చూడగా వెంకట్‌రె డ్డి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మమత ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో అమ్మమ్మ సావిత్రమ్ముకు కుప్పకూలిపోయింది. పోలీసులు వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విషాదం..
మమత పెళ్లి మరో 25 రోజుల్లో జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే వెంకట్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగాల్సి వస్తుందనుకోలేదని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.