హాట్‌హాట్‌గా..జెడ్పీ సర్వసభ్య సమావేశం
సాక్షి, హన్మకొండ : యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోం దంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యుల నిలదీత... అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ అధికార పార్టీ సభ్యులు ఆగ్రహావేశాలు వెరసి జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ హాల్‌లో చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ముందుగా వరంగల్‌లో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నెలకొల్పడంతోపాటు రైతులకు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చైర్‌పర్సన్ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమో దం తెలిపారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు గళమెత్తారు.
యూరియా కొరత ఎందుకు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిందని... అయినా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అధికారులను ప్రశ్నించారు. యూరియా బ్యాగును రూ.284కు బదులు, బ్లాక్‌మార్కెట్‌లో రూ.350-రూ.400 వరకు అమ్ముతుంటే అధికారుల ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిం చారు. యూరియాను పంపిణీ చేసే బాధ్యతను పీఏసీఎస్‌ల కు ఇవ్వడం వల్ల రాజకీయ అండదండలు ఉన్న వారికే లా భం జరుగుతోందని, సామాన్య రైతులకు న్యాయం జరగట్లేదంటూ కొందరు జెడ్పీటీసీలు లేవనెత్తారు. దీనిపై కలెక్టర్ కిషన్ స్పందిస్తూ యూరియా రైతులకు అందేలా చూడడం తో పాటు బ్లాక్ మార్కెట్ దందానుు అరికట్టేందుకు వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తామన్నారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రామారావు మాట్లాడుతూ 2009 నుంచి ఇప్పటి వర కు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు రూ. 54 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ పథకం తొలివిడత కింద జిల్లాలో 4.13 లక్షల మంది రైతుల కు రూ. 472 కోట్లు మాఫీ అయ్యాయని చెప్పారు.
భూ సర్వే చేస్తున్నాం...
దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలలో 6.5 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, వీరిలో గజం భూమిలేని వారిని గుర్తించి మొదటి దశలో పంపిణీ చేస్తామన్నారు. ఆ తర్వాత దశల వారీగా అర్హులకు గుర్తిస్తామని, ఇందుకు సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. 2011 గణన ఆధారంగా ఈ సర్వే ను చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని, ఈ విధానంలో మార్పు తేవాలని ఎంపీ సీతారాంనాయక్ కోరారు. వేయి మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడ్డ కమలాపూర్ బిల్ట్ కర్మాగారాన్ని తెరిపించాలంటూ జిల్లా పరిషత్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 22 స్పెషల్ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట
పాకాల-జూరాల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో చిన్న, మధ్య నీటి పారుదల రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. గతంలో జిల్లాలో 108 చెరువుల పునరుద్ధరణకు టెండర్లు పిలిచినా.. నేటికీ ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం గత ప్రతిపాదనలు రద్దు చేసిందని, త్వరలో కొత్త ప్రతిపాదనలతో పనులు ప్రారంభిస్తామని అధికారులు సమాధానమిచ్చారు. మరమ్మతులు, ఆధునీకరణ(రిపేర్, రిస్టోర్, రినోవేషన్, ఆర్‌ఆర్‌ఆర్) పథకం ద్వారా జిల్లాలో రూ.100 కోట్ల నిధులతో 398 పనులు చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లాలో 750 గొలుసుకట్టు చెరువులు గుర్తించామని, వీటి పునరుద్ధరణకు రూ. 156 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని చిన్ననీటి పారుదల ఎస్‌ఈ పద్మారావు తెలిపారు. గుండ్లవాగు చెరువులో చేపట్టిన అభివృద్ధి పనుల్లో తోడిన మట్టి తో రైతులు ఇబ్బంది పడుతున్నారని గోవిందరావుపేట ఎంపీపీ సమస్యను సభ దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అంగన్‌వాడీలపై పర్యవేక్షణ లేదు
జిల్లా పరిధిలో 18 ప్రాజెక్టుల్లో4,563 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా... అధికారుల పర్యవేక్షణ కరువైందంటూ జెడ్పీటీసీ లు, ఎంపీపీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్‌వాడీల్లో గుడ్లు, పాలు సక్రమంగా సరఫరా కావడం లేదని, వచ్చే కొద్ది మొత్తం పక్కదారి పడుతోందని ఆరోపించారు. పంచాయతీరాజ్ పరిధిలో 29 అంశాలను పర్యవేక్షించే అధికారం జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఉందని.... ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎంపీపీలు విచారణ చేసి నివేదికను జిల్లా యం త్రాంగానికి పంపింతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. అలాగే, చాలా రోడ్లు అధ్వానంగా మారాయని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. భూపాలపల్లి-పరకాల రోడ్లు నిర్మించిన ఏడాదికే గోతుల మయంగా మారి ప్రమాదాలకు నెలవైందని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించాలంటూ ప్రజాప్రతినిధులు కోరారు. ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నందున, వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశించారు.
తీర్మానాలివే...
జిల్లా పరిషత్ మొదటి సర్వ సభ్య సమావేశం పలు తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. రైల్వే వ్యాగ న్ వర్క్‌షాప్ నిర్మాణానికి భూ కేటాయింపు, కమలాపురం బిల్ట్ కర్మాగారం పునరుద్ధరణ, జిల్లా పరిధిలోని 2, 295 కిలోమీటర్ల పీఆర్ రోడ్లను రహదారులు, భవనాల శాఖ పరిధిలోకి మార్చడం, గ్రామీణ వరంగల్ డివిజన్‌లో ఉన్న సూపరింటెండెంట్ పోస్టును జెడ్పీ ఉద్యోగితో భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలి... 13వ ఆర్థిక సంఘంతోపాటు ఇతర నిధులన్ని కలిపి మొత్తం రూ.12.26 కోట్లతో చేపట్టే పనుల ప్రతిపాదనలు జెడ్పీటీసీల నుంచి తీసుకోవాలని తీర్మానిం చారు. సమావేశంలో ఎంపీలు గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి, శంకర్‌నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
మాకు అవకాశం ఇవ్వరా ?
జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎం పీ, ఎమ్మెల్యేల వాదోపవాదాలకు వేదిక కావడంపై జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక ్తం చేశారు. అన్ని విషయాలను ఎంపీలు, ఎమ్మెల్యేలే మాట్లాడితే క్షేత్రస్థాయిలో ఉండే తమకు అవకాశం లేకుండా పోతోందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఎంపీ సీతారాంనాయక్ తీర్మా నం ప్రవేశపెట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ పద్మను కోరారు. తీర్మానం చేస్తే ఏం లాభమని... అసెంబ్లీ లేదా పార్లమెం ట్‌లో తీర్మానం చేసి సాధించాలని ఎంపీకి సభ్యులు సూచించారు. నల్లబెల్లి మండలం కన్నారావుపేట పరిధిలోని సర్వే నెం.58లో లాటరైట్ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిందని జెడ్పీ వైస్‌చైర్మన్ మురళి తెలిపారు. 230 ఎకరాల ఈ భూమిని గతంలో సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించగా, ఎస్సీలకు అసైన్డ్ చేశారన్నారు. అదే భూమిలో ఇప్పుడు మైనింగ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ మైనింగ్ అధికారిని నిలదీశారు.
లీజు పొందామని మైనింగ్‌కు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకున్న 21మంది ఎస్సీలపై నర్సంపేట డీఎస్పీ కేసులు నమోదు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై మరోసారి సర్వే నిర్వహించాలని కలెక్టర్... మైనింగ్ ఏడీని ఆదేశించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు ప్రత్యేక మైకులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీలు పులుసం సరోజన, వంగాల యాకమ్మ, పరకాల ఎంపీపీలు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్లు తరచుగా మైకులు తీసుకోవడంపై మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడ్వాయి జెడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం జాతీయ రహదారి, లింగాల రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మోహన్‌నాయక్‌ను కోరారు. ఏటూరునాగారం వైద్యశాలలో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని జెడ్పీటీసీ వలియాబీ కోరారు. దళితులకు భూపంపిణీలో భాగంగా అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారని నర్సింహులపేట జెడ్పీటీసీ వేణు ఆరోపించా రు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక, భూమి కొనుగోలు విషయాలపై అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం అందించేలా అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, మోటపోతున్న శివశంకర్, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు పాల్గొన్నారు.