సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీపై అనుమానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టమైన ప్రకటన చేయడంతో జిల్లా రైతుల్లో ఆనందోత్సాహం నిండింది. జిల్లాలో 2.48లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరనుంది. సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. మాఫీపై లెక్కలు తేల్చడంలో కొంత జాప్యం చేసింది. దీంతో పలు రకాల అపోహలు నెలకొనడంతో ఆందోళన చోటుచేసుకుంది. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ రుణమాఫీపై ప్రకటన చేయడంతో రుణమాఫీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
మాఫీ రూ.1,223.98 కోట్లు!
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించడంతో బ్యాంకులు రుణాలకు సంబంధించి ప్రాథమిక గణాంకాలు విడుదల చేశాయి. మే నెలాఖరు నాటి వివరాల ఆధారంగా రుణాల తీరును పరిశీలిస్తే.. జిల్లాలో మొత్తం 2,48,584 మంది రైతులు రూ.1364.24 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీరిలో 2.26లక్షల మంది రైతులు రూ.లక్షలోపు రుణాలు పొందారు. అదేవిధంగా 22,544 మంది రైతులు రూ.లక్షకు మించి రుణాలు తీసుకున్నారు. సర్కారు నిర్ణయంతో లక్షలోపు రుణాలు పూర్తిగా మాఫీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా లక్షకు మించి తీసుకున్న రుణాలకు సంబంధించి ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ అయ్యే అవకాశముంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.1,223.98 కోట్లు మాఫీ కానున్నట్లు తెలుస్తోంది.
మార్గనిర్దేశకాల తర్వాతే!
రైతులు తీసుకున్న రుణాలపై రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మాఫీకి సంబంధించి పూర్తిస్థాయి మార్గనిర్దేశకాలు రావాల్సి ఉంది. బ్యాంకర్లు వెల్లడించిన వివరాల్లో మే నెలాఖరు వరకు తీసుకున్న రుణాల వివరాలున్నాయి. ఆ మేరకు మాఫీ చేస్తే రూ.1223.98 కోట్లు రద్దు కానున్నాయి. అలాకాకుండా నిర్ణీత తేదీని ప్రకటిస్తే మాఫీ పరిమితి తగ్గనుంది. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఒకరికి మించి రుణాలు తీసుకుంటే.. మాఫీ ఎలా చేస్తారనే సందేహం కూడా ఉంది. ఒకే రైతు రెండేసి రుణాలు తీసుకుంటే మాఫీ ఏ విధంగా వర్తించనుందనేది తేలాలి. మొత్తంగా ప్రభుత్వం విడుదల చేసే మార్గనిర్దేశకాల అనంతరం కచ్చితమైన రుణమాఫీ లెక్క తేలనుంది.
మాఫీ.. హ్యాపీ
Published Thu, Jul 17 2014 11:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement