సాక్షి, వరంగల్ రూరల్ : రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు చేయూతనిస్తున్నాయి. వ్యవసాయం కోసం పంట రుణాల పరిమితిని పెంచుతూ నాబార్డు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులకు ఇది శుభవార్తే. వేసవిలో దుక్కులు సిద్ధం చేసుకొని, తొలకరి చినుకులు పడగానే వెంటనే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేయడగానికి రుణాలు ఎంతో అవసరం. ప్రతి ఏడు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత్యంతరం లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట రుణ పరిమితిని పెంచిన నేపథ్యంలో సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయం సజావుగా సాగుతుంది. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్నారు. గత ఏడు ఖరీఫ్‌లో జిల్లాలో 1,42,704 హెక్టార్ల సాగు కాగా ఈ ఏడు ఖరీఫ్‌లో 146910 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ తదితర పథకాలు అమలు చేసిన ఏటా ఎరువులు, విత్తనాలు, కూలీల ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి, సరైన సమయంలో ఖరీఫ్ యాసంగి రుణాలు మంజూరు చేయకపోవడంతో పెట్టుకోసం వడ్డీ వ్యాపారులు, మార్కెట్‌లోని దళారులను ఆశ్రయించి పంట దిగుబడి వచ్చిన తరువాత ధాన్యాన్ని వారికే విక్రయించి అప్పులు తీరుస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు సిండికేట్‌గా మారగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా రైతులు అప్పులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట రుణాల పరిమితి పెంచడంతో రైతులకు కొంత ఊరట లభించినట్లయింది.
ఆదేశాలు జారీ చేశాం
పంట రుణ పరిమితిని ఈ ఏడు ఖరీఫ్‌కు పెంచుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీçసుకున్నాం. ఈ ఆదేశాలను ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు రుణాలు సకాలం అందించి రైతు అభివృద్ధికి కృషి చేయాలి. –హరిప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment