రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలా..!
రైతాంగ సమస్యలు పరిష్క రించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిం చింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడింది.
- జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
- ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి
- మాజీ మంత్రి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
- కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా
- సొంత పూచీకత్తుపై అరెస్టు, విడుదల
సంగారెడ్డి మున్సిపాలిటీ : రైతు సమస్యలను విస్మరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు విదేశీ పర్యటనలు చేస్తున్నారని డిసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామనిని చెప్పి, ఇప్పుడు వడ్డీ కట్టాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రాంతంలోని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. తమకు ఓట్లు వేసినా వేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సైతం ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలుకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకు ముందు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బండి నర్సాగౌడ్, బొంగుల రవి, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
నాయకుల అరెస్టు విడుదల ..
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్‌తో పాటు మరో 50 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.