
సూర్యాపేట రూరల్: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి దోమకాటుకు గురై దెబ్బ తినడంతో మనోధైర్యం కోల్పోయిన రైతు విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం యండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోన కృష్ణయ్య తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. కాగా దోమకాటుతో ఆరు ఎకరాల వరిచేను పూర్తిగా దెబ్బతిన్నది.
ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన కృష్ణయ్య.. తన పొలంలో ఉన్న 11/33 కేవీ విద్యుత్ టవర్ ఎక్కాడు. ఇదే సమయంలో గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన సూర్యాపేట ఎంపీపీ వట్టే జానయ్య యాదవ్ విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరారు. రైతును సముదాయించేందుకు విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఎంపీపీ.. సమస్యను మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతు కృష్ణయ్య టవర్‌పై నుంచి కిందికి దిగాడు.