
కొడుకులే కాడెడ్లుగా..
చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు చీర వెంకటయ్యకు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఈ ఏడాది పత్తి వేయాలని నిర్ణయించుకున్నాడు. వర్షాల కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం రాత్రి విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షం పడటంతో వెంకటయ్య సంతోష పడ్డాడు. శనివారం ఉదయం విత్తనాలు వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వెంకటయ్య ఇటీవలే కొనుగోలు చేసిన రెండు ఎడ్లలో ఒక ఎద్దు కాలుకు ఏమి జరిగిందో తెలియదు గానీ కాలు కిందపెట్టలేకపోతోంది. మూడు కాళ్లపైనే నిలబడుతుంది. ఎద్దు నడవలేని స్థితిలో ఉంటే అరక ఎలా కట్టాలని ఆలోచనలో పడ్డాడు. ఆలస్యం చేస్తే భూమిలో మళ్లీ పదను పోతుందని భావించి.. తన కొడుకు, తన తమ్ముని కొడుకు ఇద్దరినీ పత్తి విత్తనాలు వేసే అడ్డకు (అరకకు) కాడెద్దులుగా మార్చాడు. రెండునర్న ఎకరాల భూమిలో ఇద్దరు కొడుకులతో అడ్డకొట్టి విత్తనాలు వేశాడు. రైతు పడే కష్టం మాటల్లో చెప్పలేనిది అంటే ఇదే. – చేవెళ్ల: