1956 కన్నా ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న కథనాలపై కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
1956 కటాఫ్‌తో నష్టపోతామంటున్న భద్రాచలం, పాల్వంచ ప్రజలు
హైదరాబాద్: 1956 కన్నా ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న కథనాలపై కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ప్రజలు తీవ్రంగా కలవర పడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఈ రెండు డివిజన్లకు చెందిన విద్యార్థులెవరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం ఈ రెండు డివిజన్లలోనే 60 వేల మందికిపైగా విద్యార్థులు ఫీజుల పథకానికి దూరం కానున్నారు. ఎందుకంటే 1956కు పూర్వం ఈ రెండు డివిజన్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన మూడేళ్ల తర్వాత అంటే 1959 నవంబర్ 17న మళ్లీ ఈ రెండు డివిజన్లను ఖమ్మం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో 1956 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడి వారు అంటున్నారు. ఇప్పటికే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌తో ఈ ప్రాంతం వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ యోచన వారిని మరింత గందరగోళంలోకి నెట్టినట్లయింది. కాగా, ప్రభుత్వం తక్షణమే ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మండలి నేత డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు డివిజన్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అంతటికీ 1956 నవంబర్ 1కి పూర్వం కటాఫ్‌గా నిర్ణయించినా, భద్రాచలం, పాల్వంచలకు మాత్రం 1959ను కటాఫ్‌గా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా అందులో పేర్కొన్నారు.