
మళ్లీ అదే గొడవ
హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్‌లో ఒడవని పంచాయితీ
దూతగా వచ్చిన గాదరి కిషోర్ సమక్షంలోనూ ఆందోళనలు
అన్ని విషయాలను కేసీఆర్‌కు చెపుతానన్న పార్లమెంటరీ కార్యదర్శి
హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అనే రీతిలో వెళుతున్నారు. మొన్న ఫ్లెక్సీల పంచాయితీ జరిగిన నేపథ్యంలో వాస్తవమేంటో తెలుసుకునేందుకు శుక్ర వారం పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ హుజూర్‌నగర్ వచ్చారు. నియోజకవర్గంలో గ్రూపులుగా వ్యవహరిస్తున్న శంకరమ్మ, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్‌రెడ్డిలను పిలిపించి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. అదే సమయంలో కొందరు టీ ఆర్‌ఎస్ నాయకులు సమావేశం జరుగుతున్న అతిథిగృహం వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా, మధ్యలో వచ్చి పార్టీలో చేరిన వారితో సమావేశం కావడమేంటని వారు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు చిలకరాజు నర్సయ్య, కొణతం లచ్చిరెడ్డి, హుజూర్‌నగర్ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, మేళ్లచెరువు, గరిడేపల్లి మండల అధ్యక్షులు రెంటోజు ఉమాకాంత్, కారింగుల లింగయ్యగౌడ్‌ల ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొని 14 ఏళ్లపాటు పార్టీ జెండా మోసిన తెలంగాణ ఉద్యమకారులమైన తమకు టీఆర్‌ఎస్‌లో గుర్తింపు లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన తమను కాదని షో రాజకీయాలు చేసేవారితో చీకటి గదులలో సమావేశాలు నిర్వహించడం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆర్‌అండ్‌బీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గాదరి కిషోర్ బయటకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం తాను నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసేందుకు సమావేశమైనట్లు ఆందోళనకారులకు వివరించారు. పార్టీలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే... నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేస్తానన్నారు. ముం దుగా ముఖ్యులతో సమావేశం పూర్తి కాగానే నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలతో మాట్లాడుతానని, మీడియా ముందు హల్‌చల్ చేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే సహించేది లేదని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. దీనికి స్పందించిన ఆందోళనకారులు కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తూ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెడితే ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే కిషోర్‌కు సూచించారు. అనంతరం ఆందోళన సద్దుమనగడంతో మండలాల వారీగా ఎమ్మెల్యే కిషోర్ నాయకులతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోయారు