జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : టీడీపీ పొత్తుతో పోటీ చేస్తున్న బీజేపీకి ఓటువేస్తే ఆంధ్రా తొత్తులకు పడినట్లేనని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక విజన్ గార్డెన్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో ఎక్కడా కనిపించని రాంచందర్‌రావుకు ఓటు వేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లు అవుతుందన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తుంటే కనీసం మద్దతు తెలుపని వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిస్తే జిల్లా ప్రజల సమస్యలను ఏం పరిష్కరిస్తారన్నారు.
అధికారంలోకి రాగానే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసుకున్నప్పుడు నోర్లు తెరువని వీరు తెలంగాణ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నిక్కార్సయిన తెలంగాణ ఉద్యమ నేత దేవీప్రసాద్‌కు, ఆంధ్రతొత్తు రాంచందర్‌రావుకు మధ్య పోరు జరుగుతోందని పట్టభద్రులు విజ‘తతో తీర్పు ఇవ్వాలని మంత్రి కోరారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలో నిజాయితీ ఉందని, త్వరలోనే లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో బీజేపీ పార్టీ కుమ్ముకై తెలంగాణకు కష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రా నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ద్రోహులకు వ్యతిరేక ఓటుతో తగిన బుద్ధి చెబుదామని రాష్ర్ట వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. 60ఏళ్ల దోపిడీ సరిపోదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు చేస్తున్న కుట్రలకు బీజేపీ సహకరిస్తోందని ఆరోపించారు.
జిల్లా సమస్యలను మండలిలో వినిపిస్తా : దేవీప్రసాద్
తనను గెలిపిస్తే జిల్లా సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, నాయకులు పెద్దిరెడ్డి, శివకుమార్, వెంకటయ్య, కృష్ణముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణవాదికి.. ఆంధ్రా తొత్తుకు మధ్య పోరు
Published Sat, Mar 21 2015 3:12 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement