నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండి
- అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
- కేంద్ర సాయం కోసం నివేదికలు పంపండి
- అనుమతులు పొందిన చెరువులకు వెంటనే టెండర్లు పిలవండి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ఈ ఏడాది చేపట్టే చెరువుల అంచనాలన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చేరిన అంచనాలకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చినా టెండర్లు పిలవడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిన మంత్రి.. అనుమతులు పొందిన వాటికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
మిషన్ కాకతీయ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోవడానికి 5 రోజుల్లో ముందుకు రాకపోతే నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసి రెండవ కాల్‌కు వెళ్లాలని సూచించారు. అగ్రిమెంట్‌కు రాని కాంట్రాక్టర్‌పై చర్యలకు ఉపక్రమించాలని, మూడేళ్లు వారి బిజినెస్‌ను సస్పెండ్ చేయాలని సూచించారు.
ఈ నెల 15 నుంచి వ్యవసాయాధికారులు రుణమాఫీ పత్రాల పంపకం చేపట్టిన దృష్ట్యా నీటి పారుదల ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని, ముఖ్యంగా పూడికను పొలాల్లో వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. ట్రాక్టర్లు, జేసీబీల లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు.
కేంద్ర ఆర్థిక సాయానికి పంపాల్సిన సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి పంపాలని ఆదేశించారు. చెరువుల దత్తతకు, విరాళం ప్రకటించేందుకు ముందుకొచ్చిన వారిని వ్యక్తిగతంగా లేక ఈమెయిల్ ద్వారా సంప్రదించి వారికి తగు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, నారాయణరెడ్డి, సీఈలు రామకృష్ణారావు, రమేశ్, ఎస్‌పీడీ మల్సూర్ పాల్గొన్నారు.
చెరువుల పురోగతి ఇలా..
మొత్తం చెరువులు : 46,447
ఈ ఏడాది చేపట్టనున్నవి : 9,662
సర్వే పూర్తయినవి : 7,212
అంచనాలు పూర్తయినవి : 5,635
పరిపాలనా అనుమతులు లభించినవి : 2,569
టెండర్లు పిలిచినవి : 1,143