
తారల ‘పన్ను’పోటు
రూ.100 కోట్ల మేర పన్ను చెల్లించని సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ రంగం ప్రముఖుల సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) బకాయిలు ఎంతో తెలుసా...? అక్షరాలా రూ.100 కోట్లపైనే. ఓ సినిమాను నిర్మాతలు నిర్మిస్తే పారితోషికం తీసుకుని అందులో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర ప్రముఖులను తమ సేవలను అందిస్తున్నట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో నిర్మాతల నుంచి పారితోషికాలతోపాటు సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) రూపేణా సొమ్ము వసూలు చేస్తున్న కొందరు సినీ ప్రముఖులు ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు ‘పెద్దలు’ కనీసం సేవల పన్ను విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బండి లాగిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ ఆధీనంలోని సేవల పన్ను విభాగం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ విభాగం చట్టపరమైన చర్యలకు సమాయత్తమైంది.
సేవల పన్ను ఇలా: వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సేవల పన్నును చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. సినీరంగం విషయానికొస్తే.. నిర్మాతల నుంచి పారితోషికం తీసుకుని వారి చిత్రాల్లో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర నిపుణులు తమ సేవలను అందిస్తున్నట్లే లెక్క. దీంతో ఆర్థిక చట్టప్రకారం వీరు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆధీనంలోని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. కాగా నిర్మాత నుంచి పారితోషికం తీసుకునే సమయంలో వీరంతా అదనంగా 12.36 శాతం చొప్పున సేవల పన్ను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు వారు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు వార్షిక రిటర్న్స్ దాఖలు సమయంలో ఈ అంశాలను పక్కాగా లెక్కల్లో చూపి ఆ మొత్తాన్ని సేవల పన్ను విభాగానికి చెల్లించాల్సి ఉంది.
పరిశీలనలో బయటపడిన జాతకాలు..
గడిచిన కొన్నేళ్లుగా అనేకమంది సినీ ప్రముఖులు సరైన రిటర్న్స్ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. లోతుగా ఆరా తీసిన నేపథ్యంలో చాంబర్స్, మండళ్లతోపాటు దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులుసహా మరికొందరు రూ.100 కోట్లకుపైగా బకాయి పడినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతాక్రమంలో ఈ సెలబ్రిటీల జాబితాను, సంస్థల పేర్లను సిద్ధం చేసిన అధికారులు ఆయా సంస్థలకు, వ్యక్తులకు సోమవారం నుంచి సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు.
ఆర్థిక చట్టప్రకారం రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారమూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమన్లకు స్పందించని వారిపై వరుస దాడులు చేయడంతోపాటు అరెస్టు చేయాలని నిర్ణయించారు.
రాజకీయంగానూ కీలకంగా ఉన్న ఓ ప్రముఖ నటుడితోపాటు మరో ప్రముఖ గాయని, ఇంకా మరికొందరు ప్రముఖులు కనీసం సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని అధికారులు గుర్తించారు. వీరికీ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.
2011లో రెండు ప్రముఖ సంస్థలపై సేవల పన్ను విభాగం దాడులు చేసింది. ఆ సమయంలో బకాయిలు చెల్లించడానికి కొంత గడువు కోరిన వారు.. ఆ గడువు తీరిన తర్వాత కూడా చెల్లించలేదు. ఈ దఫా వీరిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.