
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లా డారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థూల ఉత్పత్తి 10%అంటే ప్రశ్నార్థకం
రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 % అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదా యం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు.
డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు?
కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, 7 నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్ టెండరింగ్ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment