
సాక్షి, హైదరాబాద్: అవసరాలకు అప్పులిస్తూ అధిక వడ్డీలు వసూలు చేసి అక్రమ దందా సాగిస్తున్న లింగోజిగూడకు చెందిన తండ్రీకొడుకులు హేమ్‌రాజ్, సాయిబాబాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇలాంటి వ్యవహారాలు రాజధానిలోని మూడు కమిషనరేట్లలో సర్వసాధారణం. గతంలో ఓసారి సిటీ పోలీసులు ఈ అక్రమ ఫైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపారు. దీనిపై ‘ఫిర్యాదు’చేయడానికి ఓ ఉన్నతాధికారిణి దగ్గరకు ఓ యూనియన్ వచ్చింది.
వారిని చూసిన సదరు అధికారి ‘మీ అందరికీ లైసెన్స్‌లు ఉన్నాయా?’అంటూ ప్రశ్నించగా... ‘అవి ఎక్కడ తీసుకోవాలి?’అని అడిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు ఉదాహరణలు చాలు నగరంలో సగానికంటే ఎక్కువ ఫైనాన్స్ సంస్థలు అక్రమంగా నడుస్తున్నాయని చెప్పడానికి. రాజధానిలో డైలీ ఫైనాన్షియర్లు, పాన్‌బ్రోకర్లు దాదాపు పది వేల మందికి పైగా ఉంటారని పోలీసుల అంచనా. వీరిలో సగం కంటే తక్కువమందే రెవెన్యూ నుంచి లైసెన్స్‌లు తీసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ వారి దందా యథేచ్ఛగా సాగుతోంది.
అడుగడుగునా ఉల్లంఘనలే...
నగరంలోని పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోజుకు 18 శాతం వరకు వడ్డీ వసూలు చేసేవారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అప్పటికే ఫైనాన్స్ ఉన్న ద్విచక్ర, తేలికపాటి వాహనాలపై వీరు రీ–ఫైనాన్స్ సైతం చేస్తుంటారు. చిరు వ్యాపారులకు ఉదయం రూ.900 ఇచ్చి సాయంత్రానికి వారి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తుంటారు.
ఇవన్నీ ఎక్కడా రికార్డుల్లోకి ఎక్కవు. కేవలం నోటి మాటలు, చిత్తుకాగితాల పద్దులతో నడిచిపోతుంటాయి. ఫలితంగా లైసెన్స్, ఆదాయ పన్ను సహా ఇతర పన్ను వంటివి వీరికి తెలియని విషయాలుగా మారిపోయాయి. ఆయా అధికారులకు ఈ ఉల్లంఘనలపై సమాచారం అందించే నాథుడు లేకుండా పోయాడు. ఎప్పుడైనా ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు అందినా.. తగిన సిబ్బంది, వనరులు లేక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రికవరీలకు ప్రైవేట్ సైన్యాలు
ఈ దందాలో దేహదారుఢ్యం కలిగిన ‘ప్రైవేట్ సైనికులకు’డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మొండి బకాయిలు రాబట్టుకోవడానికి బెదిరింపులు, అవసరమైతే కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడటం వీరి అనధికారిక విధి. ఇలాంటి ప్రైవేట్ సైన్యాలు దాదాపు ప్రతి ఫైనాన్షియర్ అధీనంలోనూ పని చేస్తుంటాయి. వీరి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నా బా«ధితులు మాత్రం ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. సదరు ఫైనాన్షియర్లతో ‘మళ్లీ అవసరం’వస్తుందనే భయమే దీనికి ప్రధాన కారణం.
అందరికీ తెలిసినా చర్యలు శూన్యం...
ఈ వ్యవహారాలు రాజధానిలోని మూడు కమిషనరేట్లలో జరిగేవే. పాతబస్తీతో పాటు సికింద్రాబాద్, పాట్ మార్కెట్, బేగంబజార్, సిద్ధి అంబర్‌బజార్, అమీర్‌పేట్, కోఠి, సుల్తాన్‌బజార్ ఇలా అనేక ప్రాంతాల్లో నిత్యకృత్యాలే. నగరానికి చెందిన కొందరు పాన్‌బ్రోకర్లు అనేక మంది బడా వ్యాపారులకు బినామీలుగా ఉంటూ వ్యవహారాలు సాగిస్తున్నారు. వీరిలో కొందరు అధికారులకు నిత్యం ‘అవసరాలు’ తీరుస్తుంటారని సమాచారం.
ఆటో ఫైనాన్షియర్లే ఎక్కువగా ప్రైవేట్ సైన్యాలు నిర్వహిస్తున్నారు. వీరి వ్యవహారాలపై ‘సమాచారం, ఫిర్యాదు లేకపోవడంతో’ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. రాచకొండ పోలీసులు పట్టుకున్న ఇద్దరే కాదు.. పక్కాగా నిఘా ఉంచితే ప్రతి రోజూ పదుల సంఖ్యలో అక్రమ ఫైనాన్షియర్లు పట్టుబడతారు. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మాత్రమే స్పందించి హడావుడి చేసే పోలీసులు, ఇతర విభాగాల అధికారులు ఆపై మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment