ఠాణా నుంచి ఇంటర్‌పోల్‌ దాకా.. | Fingerprints of the accused in Fingerprints Bureau Database | Sakshi
Sakshi News home page

ఠాణా నుంచి ఇంటర్‌పోల్‌ దాకా..

Published Sat, Jun 23 2018 1:58 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

Fingerprints of the accused in Fingerprints Bureau Database - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని కమిషనరేట్‌ పరిధిలో ప్రతీక్షణం రద్దీగా ఉంటే ఓ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ హత్య జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలికి చేరుకున్న క్లూస్‌ టీం ఫింగర్‌ ప్రింట్‌ సేకరించారు. అనుమానిత వేలిముద్రలను ఫింగర్‌ ప్రింట్‌బ్యూరో, ఫ్యాక్ట్‌ (ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌) ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టారు. అతికొద్ది నిమిషాల్లోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు పాత నేరస్తుడు ఎంజే నాగరాజుగా తేలింది. దీంతో అతడి కోసం వేట సాగించిన పోలీసులు 24 గంటల్లోనే నేరస్థుడిని కటకటాల్లోకి పంపించారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం రాష్ట్రానికి చెందిన నిందితుల వేలిముద్రల డాటా మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటర్‌పోల్‌లో ఉన్న నిందితుల జాబితా వరకు ఆన్‌లైన్‌ డేటా బేస్‌ అందుబాటులోకి వచ్చింది.  

మొట్టమొదటగా రాష్ట్ర పోలీస్‌ శాఖ... 
టెక్నాలజీని వినియోగించి నేరాల నియంత్రణకు విశేషంగా ప్రయత్నిస్తున్న పోలీస్‌ శాఖ.. కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు కోసం వేలిముద్రల డేటాబేస్‌ను ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌తో అనుసంధానించింది. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఫింగర్‌ ప్రింట్స్‌ డేటాను ఆన్‌లైన్‌లో అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండేలా సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)తో సైతం అనుసంధానించింది. ఇలా 9 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల నేరస్తుల వేలిముద్రలను డేటాబేస్‌లో పెట్టి 868 పెండింగ్‌ కేసులను ఛేదించింది. అలాగే రూ.7.2కోట్ల సొత్తును స్వాధీనం చేసుకుంది. 42 గుర్తు తెలియని మృతదేహాలను సైతం గుర్తించింది. ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను పెట్రోలింగ్‌ సిబ్బందికి మొబైల్‌యాప్‌ ద్వారా అందించింది. దీంతో క్షణాల్లో ఘటన స్థలి నుంచే నిందితుడు పాత నేరస్తుడా? లేకా కొత్తగా నేరం చేశాడా? అన్నది తేలిపోతుంది.  

ఇంటర్‌పోల్‌ జాబితా సైతం... 
కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి హత్య జరిగింది. నిందితుడు దేశం దాటి పారిపోయినట్లు అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్‌కు సమాచారమిచ్చారు. ఇంటర్‌పోల్‌ నుంచి మన సీబీఐకి సమాచారం అందింది. నిందితుడి అనుమానిత వేలిముద్రలను సీబీఐ–ఎన్‌సీఆర్‌బీ ఫ్యాక్ట్‌లోని వేలిముద్రలతో సరిపోల్చి పంజాబ్‌కు చెందిన ఏపీ సింగ్‌గా గుర్తించారు. ఇలా విదేశాల్లో, మన దేశంలో జరిగిన హత్య కేసుల దర్యాప్తులో ఇప్పుడు ఫ్యాక్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ కీలకంగా మారింది. ఇంటర్‌పోల్‌కు సంబంధించిన ఫింగర్‌ ప్రింట్స్‌ డేటాను సైతం మన దేశంలోని ఏ స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచైనా దర్యాప్తు అధికారులు అనాలిసిస్‌ చేసుకునే వెసులుబాటు దొరికింది.

దేశవ్యాప్తంగా 11.68లక్షలు 
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్‌ శాఖలు సేకరించిన వేలిముద్రల డేటా ఫ్యాక్ట్‌లో అందుబాటులో ఉంది. ఇలా ఈ ఏడాది మే చివరి వరకు 11,68,775 ఫింగర్‌ ప్రింట్స్‌ డేటా బేస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇంటర్‌పోల్‌ నుంచి మన డేటాబేస్‌ అనాలిసిస్‌ కోసం 15,718 ఫింగర్‌ ప్రింట్స్‌ వచ్చాయి. ప్రతీ నెలా దేశవ్యాప్తంగా 7,162 వేలిముద్రలు ఫ్యాక్ట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌ డేటాబేస్‌కు వస్తున్నట్లు సెంట్రల్‌ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement