ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భైంసాలో తునికాకు గోడౌన్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గోడౌన్ నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 90 లక్షల విలువైన తునికాకు దగ్ధమైందని గోడౌన్ యజమానులు తెలిపారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.