‘ముందుగా సంపన్నుల ఇళ్లను కూల్చండి’
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. నగరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో ముందు సంపన్నులు కబ్జా చేసి కట్టిన ఇళ్లను కూల్చిన తర్వాతే పేదల ఇళ్ల వైపు వెళ్లాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ నిధులను మళ్లించి, మళ్లీ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని 2015లోనే హైకోర్టు ఆదేశిస్తే ఇప్పటి దాకా కూల్చకుండా ఇప్పుడు డ్రామాలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్వయంగా పట్టాలు ఇచ్చిన వారి ఇళ్లు కూల్చాలంటే వారికి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పేదలపై ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఆక్రమణలను కక్షపూరితంగా కాక ప్రణాళికా బద్ధంగా కూల్చాలన్నారు. విపత్తులను ఎదుర్కొనే ప్రణాళికలను సిద్ధం చేసుకోలేదు కాబట్టి వైఫల్యాలు తప్పడం లేదన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటివరకూ 600కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కాగా, నేడు దాదాపు 160 కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.