
ఐదు రూట్లు.. 83 కి.మీ.
మెట్రో రెండోదశ ప్రణాళికపై మంత్రి కేటీఆర్
♦ వచ్చే ఏడాది ప్రథమార్థంలో తొలిదశ మార్గం ప్రారంభం
♦ ప్రారంభ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని వెల్లడి
♦ సుల్తాన్‌బజార్ మధ్య నుంచే మెట్రో వెళుతుందని స్పష్టీకరణ
♦ బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామని హామీ
♦ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ ఎలక్ట్రికల్ బస్సులు
♦ మెట్టుగూడా-ఉప్పల్ మార్గంలో మెట్రోలో ప్రయాణించిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో చేపడుతున్న 72 కి.మీ. మెట్రో తొలి దశతోపాటు సమీప భవిష్యత్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును ఐదు రూట్లలో 83 కి.మీ. మార్గంలో నిర్మించనున్నట్టు ఐటీ,పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. మెట్రో తొలిదశ ప్రారంభ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభోత్సవం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నగరవాసులు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.
శుక్రవారం మెట్టుగూడా మెట్రో రైలుస్టేషన్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు 8 కి.మీ. మార్గంలో నిర్వహించిన ట్రయల్న్‌ల్రో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో కలసి కేసీఆర్ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం ఉప్పల్ మెట్రో డిపో లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టులో ఆస్తుల సేకరణ, పలు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు.
అసెంబ్లీ ముందు నుంచే మెట్రో..
అసెంబ్లీ వెనుకవైపు నుంచి మెట్రో మార్గం వెళితే చారిత్రక జూబ్లీహాల్ భవనం దెబ్బతింటున్నందునే ముందుగా నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ ముందు నుంచి మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. చారిత్రక సుల్తాన్‌బజార్ ప్రాంతంలో ఆరు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత పాత మార్గాన్నే ఖరారు చేశామని, ఆస్తులు కోల్పోతున్న వ్యాపారులకు మెరుగైన పరిహారం అందజేస్తామని, ఈ ప్రాంతం హాకర్స్ హబ్‌గా మారనుందన్నారు. సుల్తాన్‌బజార్ ప్రధాన రహదారి మధ్య నుంచి 65 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే స్థలాన్ని సేకరిస్తామన్నారు. పాతనగరానికి సైతం అనుకున్న గడువు ప్రకారం 2017 జూన్ నాటికి మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని స్పష్టం చేశారు. ఓల్డ్‌సిటీలో అలైన్‌మెంట్ మార్పులపై అధ్యయనం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న నగర మెట్రో ప్రాజెక్టులో అవసరమైన మేర స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. మెట్రో నిర్మాణ పనుల్లో 18 వేల మంది, హెచ్‌ఎంఆర్ సంస్థ తరఫున మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
మన మెట్రోనే అత్యుత్తమం
ప్రపంచవ్యాప్తంగా 16దేశాల్లో మెట్రో ప్రాజెక్టులను తాను చూశానని.. అయితే నగర మెట్రో ప్రాజెక్టు వాటన్నింటికంటే అత్యుత్తమంగా ఉందని కేటీఆర్ కితాబిచ్చారు. మెట్రోస్టేషన్ల నుంచి సమీప కాలనీలకు వెళ్లేందుకు మినీ ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా 100 సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టుతో నగర బ్రాండ్ ఇమేజ్ బాగా పెరుగుతుందని హోంమంత్రి నాయిని చెప్పారు. మెట్రో రైలులో ఎలాంటి కుదుపులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించామని, పనులు శరవేగంగా సాగుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ చెప్పారు. మెట్రో ప్రాజెక్టు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందన్నారు.