సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చదువుకున్నవారు ఎక్కువే ఉన్నప్పటికీ.. ఓటేసే వారు తక్కువే అని చెప్పాలి. నేతల తీరుపై విసుగు.. అలసత్వం.. ఉదాసీనత.. కారణమేదైనా ఓటింగ్‌లో పాల్గొనే సిటీజనులు స్వల్పమే. పలు ఎన్నికల్లో ఈ విషయం వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అనేక నియోజకవర్గాల్లో 30 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగింది. 22 శాతమే జరిగిన ప్రాం తాలూ ఉన్నాయి.
ప్రజల చేతిలో పాశుపతాస్త్రమైనప్పటికీ, ఓటు విలువ తెలిసిన వారు తక్కువే కావడంతో, ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు పడతారని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
భారీగా ప్రచారం
గత (2009) సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ జరగడంతో.. ఈసారి ప్రజలంతా పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు గ్రేటర్ ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ఓటు హక్కు గురించి ఓటర్లకు తగు అవగాహన కల్పించేందుకు వివిధ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఎన్నికల సిబ్బంది స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి తప్పనిసరిగా ఓటు వేయాల్సిందిగా సూచిస్తున్నారు. ‘ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే సకాలంలో సదుపాయాలు సమకూరుతాయి. రేషన్ సరుకులు అందలన్నా.. సమయానికి గ్యాస్ రావాలన్నా.. తాగునీరు, విద్యుత్, ఇతరత్రా సమస్యలు తీరాలన్నా ఓటేసి తగిన అభ్యర్థిని గెలిపించుకోవాలి’ అని చెబుతున్నారు. ఓటు వేయకుండా మాత్రం ఉండవద్దని ప్రచారం చేస్తున్నారు.
తక్కువ పోలింగ్ జరిగిన స్థానాలపై దృష్టి
గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం మాత్రమే పోలింగ్ జరిగిన ప్రాంతాలను గుర్తించి, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఓటు ఆవశ్యకతను తెలిపే కర పత్రాలను పంపిణీ చేస్తున్నారు. సదరు కరపత్రాల్లో ‘ఓటు విలువ తెలుసుకో- విజ్ఞతతో ఎన్నుకో’ శీర్షికతోపాటు ‘స్వచ్ఛందంగా ఓటేద్దాం- కార్యసాధకులను గెలిపిద్దాం’ తదితర నినాదాలు పొందుపరిచారు. ప్రలోభాలకు లొంగకూడదనే హెచ్చరికలూ చేశారు. ఇప్పటికే వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎక్కువమంది ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న యంత్రాంగం.. ఓటర్లుగా ఉన్నవారు తప్పనిసరిగా ఓటు వేయాలనే అంశాన్నీ చాటి చెబుతున్నారు.
పోలింగ్ తేదీ.. సమయం తదితర వివరాలు కరపత్రంలో పొందుపరిచారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన కేంద్రాల్లో తొలి వరుసలోని పది కేంద్రాలను గుర్తించి, సదరు కేంద్రాల పరిధిలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోనున్న రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో 30 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన కేంద్రాలను గుర్తించి, ఆ ప్రాంతాల ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. ఇలా.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయడం ద్వారా .. గతం మాదిరిగా తక్కువ పోలింగ్ జరగకుండా ఉండేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
ఓటేయండి
Published Wed, Apr 2 2014 12:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement